కరోనా పరిస్థితుల్లో అసాధ్యమనుకున్న ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. ఇందుకోసం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు వంద కోట్ల రూపాయలకుపైనే చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.
సాధారణంగా లీగ్ భారత్‌లో జరిగితే.. ఆయా రాష్ట్ర సంఘాలకు మ్యాచ్‌కు కోటి రూపాయల చొప్పున చెల్లిస్తుంది బీసీసీఐ. దీని ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లకు 60కోట్లు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తం చెల్లించేందుకు రూ.30 నుంచి 50 లక్షలను ఫీజు రూపంలో ఫ్రాంఛైజీల నుంచి వసూలు చేస్తుంది బీసీసీఐ.
ఈ ఏడాది దుబాయ్‌లో లీగ్ జరగడం వల్ల మ్యాచ్ నిర్వహణ ఖర్చులతో సహా క్రీడాకారుల వసతులు, ఆహారం, ప్రయాణ ఖర్చుల మొత్తం కలిపి రూ.104 కోట్లను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు చెల్లించింది భారత బోర్డు. కాబట్టి ఇక్కడితో పోలిస్తే దుబాయ్‌లో నిర్వహించినందుకు ఎక్కువ ఖర్చయింది.
ఈ ఏడాది ఐపీఎల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు సార్లు కప్‌ను గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన దిల్లీ క్యాపిటల్స్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇదీ చూడండి : '2021లోనూ సన్‌రైజర్స్‌తోనే విలియమ్సన్'