మహిళల ఛాలెంజర్ టోర్నీలో (మినీ ఐపీఎల్) స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు తరఫున ఆడబోతోంది నటకాన్ చాంటమ్. మినీ ఐపీఎల్ ఆడుతున్న తొలి అసోసియేట్ దేశ క్రీడాకారిణి ఆమే. క్రికెట్లో ఎదిగేందుకు నటకాన్ చాలా ఇబ్బందులు పడింది.
నాన్న సాయంతో..
మొదట బాస్కెట్‌బాల్ ఎంచుకున్నా ఆ తర్వాత క్రికెట్ వైపు ఆకర్షితురాలైన ఈ థాయ్ అమ్మాయి.. అప్పటి నుంచి ఇక వదల్లేదు. ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయుడైన నాన్న సాయంతో వాటిని అధిగమించింది. విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్‌లను ఆరాధ్యంగా భావించే ఈ థాయ్ అమ్మాయి.. క్రికెట్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించుకుని ప్రాక్టీస్ చేసేది.
"థాయ్‌లాండ్‌లో టీవీల్లో క్రికెట్ లైవ్‌లో చూడలేం. లేకపోతే సామాజిక మాధ్యమాల్లో చూడాల్సి వచ్చేది. అంతేకాదు క్రికెట్‌కు సంబంధించిన ఏ పరికరమైనా భారత్ నుంచో ఆస్ట్రేలియా నుంచో దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఛాలెంజర్ టోర్నీలో ఆడే అవకాశం వస్తుందని ఊహించలేదు. ఎప్పుడెప్పుడు మినీ ఐపీఎల్లో ఆడతానో అనే ఉత్సాహంతో ఉన్నాను."
--నటకాన్ ఛాంటమ్
ఓపెనింగ్ బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్ చేసే నటకాన్ థాయ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా ఎదిగింది. భారత్ వేదికగా జరిగిన నాలుగు దేశాల టీ20 టోర్నీలో థాయ్‌లాండ్-ఎ తరఫున భారత్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ చాంటన్ 80 పరుగులు చేసి సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌పై ఆమె అర్ధసెంచరీతో మెరిసింది.
ఇదీ చూడండి:మహిళా టీ20 ఛాలెంజ్ షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి