ఇండియన్ క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న (unknown facts of dhoni) పేరు అంతా ఇంత కాదు!. పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు (dhoni strategies in cricket) రచించి జట్టును విజయతీరాలకు చేర్చడం అతని ప్రత్యేకత. కుర్రాళ్లను సానపట్టడంలో, పనితనం రాబట్టడంలో ధోనీ దిట్ట. మహీ సారథ్యంలోనే టీమ్ఇండియా ప్రపంచస్థాయిలో (T20 world cup 2021 latest news) ఉన్నత స్థానాలను అధిరోహించింది. అందుకే ధోనీని భారత జట్టుకు మెంటార్‌గా నియమించింది బీసీసీఐ. అయితే.. ధోనీ ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం!
అది 2007...
భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. 39వ ఓవర్‌లో సచిన్ తెందూల్కర్ బౌలింగ్‌కి వచ్చాడు. అప్పటికే షాహిద్ అఫ్రిది జోరుమీదున్నాడు. వికెట్ల వెనుక ఉన్నది కుర్ర ధోనీ. అఫ్రిది ఆటను గమనించి మహీ.. ఓవర్ మూడో బంతి వేస్తుండగా సచిన్‌కు సైగ చేశాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా బంతి వేయమని దాని అర్థం. బంతిని, ధోనీ బుర్రను అర్థం చేసుకోని అఫ్రిది వికెట్లు వదిలి ముందుకొచ్చాడు. అంతే ధోనీ బంతిని ఇలా అందుకొని.. అలా వికెట్లు గిరటేశాడు. ధోనీ మాస్టర్ మైండ్ ఏంటో (why dhoni is famous) అప్పుడే క్రికెట్ ప్రేక్షకులకు కనిపించింది.
ఇక 2021..
ఆ మ్యాజిక్ బ్రెయిన్ టీమిండియా నుంచి రిటైర్ అయ్యింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలని బీసీసీఐ ధోనీని మెంటార్‌గా తీసుకొచ్చింది. తొలి మ్యాచ్ టీమిండియాకే కాదు.. మెంటార్ ధోనీకీ అగ్నిపరీక్షే. మొత్తం ప్రపంచకప్ ఫలితం ఒకెత్తు అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ మరో ఎత్తు. అంతలా అంచనాలు ఉంటాయి ఈ మ్యాచ్ విషయంలో. అందులోనూ మెంటార్‌గా ధోనీకి ఇది తొలి మ్యాచ్. జట్టుతోపాటు మైదానంలో ఉండి ఆడించడం ఒకెత్తు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ప్రణాళికలు రచించడం, వాటిని కెప్టెన్ అమలు చేసేలా చూసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు ధోనీ అదే చేయబోతున్నాడు.
టీ20 ప్రపంచకప్ తొలి విజేత భారత్. అప్పుడు జట్టును ముందుండి నడిపించింది మహేంద్రుడే. ఆ తర్వాత ఐదు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. అందులో ఒక్కసారే భారత్ ఫైనల్‌కు వెళ్లింది. దీంతో ఈసారి కప్ పక్కాగా కొట్టాలని టీమిండియా ఫిక్స్ అయ్యింది. అందుకోసం టీమ్‌ని సిద్ధం చేసుకుంటూ వచ్చింది. ఈ కీలక టోర్నీకి ధోనీ లాంటి మ్యాజిక్ బుర్ర కూడా ఉంటే బాగుంటుందని భావించి మెంటార్‌గా తీసుకున్నారు. ఎందుకంటే కుర్రాళ్లను సానపట్టడంలో, పనితనం రాబట్టడంలో ధోనీ దిట్ట. మ్యాచ్‌ను గెలిపించే ప్రణాళికలు మూడు సెట్లు ధోనీ దగ్గర ఉంటాయి అంటుంటారు అతని సహచరులు. టీమిండియాలో, చెన్నై సూపర్‌కింగ్స్‌లో ధోనీ చేసిందిదే.
భజ్జీని కాదని..
మిస్టర్ కూల్ అని ధోనీని పిలుస్తుంటారు అంతా. మైదానంలో ఎంతటి (dhoni as captain record) భావోద్వేగాలు వచ్చినా.. ముఖంలో కనిపించకుండా తను వేసుకున్న ప్రణాళికలను ఆచరణలో పెడుతుంటాడు. దానికి తగ్గ ఫలితాలను సాధిస్తుంటాడు. వికెట్ల వెనుక ఉండి బంతిని, మైదానాన్ని, బ్యాట్స్‌మన్‌ను ఎలా చదువుతాడో.. బౌలర్లనూ అంతగానే చదివేసుంటాడు. ఎవరిని ఎప్పుడు బౌలింగ్‌కి తీసుకురావాలన్నది ధోనీకి బాగా తెలుసు. ఎలా బౌలింగ్ చేయాలో సూచించడమూ తెలుసు. ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేసే బౌలింగ్ మార్పులు ధోనీ నుంచి చూడొచ్చు. దీనికి ఒక ఉదాహరణ 2007 ప్రపంచకప్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ సీనియర్ అయిన హర్భజన్ సింగ్‌ని కాదని, కొత్త పేసర్ జోగీందర్ శర్మకు ఇవ్వడం. అందుకు తగ్గట్టే జోగీ.. మిస్బాహుల్ హక్ వికెట్ తీసి మ్యాచ్ గెలిపించాడు.
బ్యాటర్ మారితే..
క్రీజులో బ్యాటర్ మారితే.. ధోనీ మైండ్‌లో స్క్రీన్ మారిపోతుంది అంటుంటారు. కొత్త బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్ ఎవరా అనే విషయం... ఆ ఆటగాడు క్రీజులోకి వచ్చి గార్డ్ తీసుకునేలోపే ఊహించేస్తుంటాడు. అందుకే ఎడమచేతి వాటం బ్యాటర్లు రాగానే ఆఫ్‌స్పిన్నర్‌ను రంగంలోకి దించుతాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇలా చేసే 200కు పైగా లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లు తీసుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో జోరుమీదున్న మ్యాక్స్‌వెల్‌ను బోల్తా కొట్టించడానికి ధోనీ.. అశ్విన్‌ను దించాడు. దానికి కారణం మ్యాక్సీని ఔట్‌చేయడంలో అశ్విన్‌కు ఉన్న రికార్డు. జడేజా లాంటి బౌలింగ్ ఆల్‌రౌండర్... అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా మారడంలో ధోనీ పాత్ర కీలకం.
బోల్తా కొట్టించేలా..
యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ లాంటి రిస్ట్ స్పిన్నర్లను ఎలా ఎప్పుడు వాడాలో ధోనీకి బాగా తెలుసు. దీనికి ఉదాహరణ... ధోనీ జట్టు నుంచి తప్పుకున్నాక కుల్‌దీప్, చాహల్ పూర్వపు జోరు చూపించలేకపోతుండటమే. వికెట్ల వెనుక నుంచి ధోనీ ఇచ్చే ఫీడ్‌బ్యాక్, సపోర్టును చాహల్, కుల్‌దీప్ బాగా మిస్ అవుతున్నారని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు. బంతి వేగం తగ్గించి బోల్తా కొట్టించడం టీ20ల్లో ఎక్కువగా చూస్తుంటాం. అలా ఎప్పుడు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పే బుర్ర ధోనీది. 2012 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ వేసిన ఓ డెలివరీ అందుకు ఉదాహరణ. జోరు మీదున్న ఇంగ్లిష్ బ్యాటర్ స్లో బంతితో బోల్తా కొట్టించాడు పఠాన్. 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీని బౌలింగ్‌కి దింపి వికెట్ సాధించడమూ ఇలాంటిదే.
వికెట్లను చూడకుండా..
క్రికెటరా.. ఫుట్‌బాల్ గోల్ కీపరా? ఓ మ్యాచ్‌లో ధోనీ కీపింగ్ స్టైల్‌ను చూసి కామెంటేటర్లు అన్నమాటలివి. గోల్ కీపర్‌లాగా కాళ్లు చాపి మరీ బంతిని ఆపితే ఇలా కాక ఇంకేమంటారు. బంతిని బ్యాట్స్‌మన్ ఆఖరి వరకు వేచి చూసి.. స్లిప్, కీపర్ మధ్యలో కొడదామని చూస్తే.. అంతకంటే ముందే బ్యాట్ యాంగిల్ చూసి కాళ్లు చాపి బంతిని ఆపేసే బుర్ర అది. ధోనీని బెస్ట్ కీపర్ అనడానికి ఇదొక్క విషయమే చాలదు అనుకుంటే.. ఇంకా చాలా ఉన్నాయి. వికెట్లను చూడకుండా బంతిని కాళ్ల కింద నుంచి వికెట్ల మీదకు కొట్టడం, గ్లోవ్ యాంగిల్ చేసి దూరంగా వస్తున్న బంతి వికెట్ల మీదకు మళ్లేలా చేయడం.. ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇందులో కీపింగ్ టాలెంట్ ఎంత ఉందో, ఆలోచన కూడా అంతే కనిపిస్తుంది.
మాటలాపు.. ఆట ఆడు..
క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ను ఎదుర్కోవాలంటే తిరిగి మాటలు అనక్కర్లేదు. అవతలి జట్టు మీద ఒత్తిడి పెంచితే చాలు.. ఇదీ ధోనీ ఆలోచన. దీనినే కెరీర్ అంతా చేసుకుంటూ వచ్చాడు ధోనీ. దీనినే మైండ్ గేమ్ అంటుంటాడు. తనే కాదు, తన టీమ్ మేట్స్‌కు కూడా ఇదే మాట చెబుతుంటాడు. ఓసారి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సురేశ్ రైనాతో ఉమర్ అక్మల్ మాటల యుద్ధం లేపాడు. ఇదే విషయం ధోనీ దగ్గర రైనా చెబితే.. మాటలు కాదు.. ఆట ఆడి వాళ్ల మీద ఒత్తిడి పెంచు అని చెప్పాడట. అందుకే ఈ మైండ్‌ను ఇప్పుడు మెంటార్ చేసింది.