ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ (india vs pakistan match latest news) అనంతరం క్రీడా స్ఫూర్తిని చాటారు ఆటగాళ్లు. పోరాటమేదైనా ఆటలోనే.. ఒక్కసారి ఆట ముగిశాక అందరం ఒక్కటే అని చాటిచెప్పారు. గెలుపు కోసం చేసే పోరాటంలో భావోద్వేగాలు అక్కడికే పరిమితం, ఆ తర్వాత ప్రత్యర్థి జట్లు స్నేహితులేనన్నట్లు వ్యవహరించారు.
పాక్‌కు విజయం వరించాక క్రీజులో ఉన్న రిజ్వాన్, బాబర్‌కు ష్యేక్హాండ్ ఇచ్చాడు కెప్టెన్ కోహ్లీ. రిజ్వాన్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఆడేటప్పుడు మాత్రమే గెలుపోటములు, వ్యూహప్రతివ్యూహాలు.. ఆట ముగిశాక అంతా సోదరభావమే అని తన చేష్టలతో చాటిచెప్పాడు. ఆ దృశ్యాలు ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేశాయి. దీనిపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.