అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు టీమిండియా స్క్వాడ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మతో ఎవరు ఓపెనింగ్ చేస్తారో వేచి చూడాల్సిందే. మాజీ సారథి ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది.
టీమ్ఇండియా స్క్వాడ్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్స్:శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
"ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననున్న భారత జట్టుకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. టీమ్ఇండియా మెంటార్‌గా ఉండేందుకు బీసీసీఐ అభ్యర్థనను ధోనీ అంగీకరించడం సంతోషంగా ఉంది. కోచ్ రవిశాస్త్రితో పాటు ఉన్న సహాయక సిబ్బందితో కలిసి ధోనీ పనిచేస్తారు".
- జైషా, బీసీసీఐ కార్యదర్శి
"అదే విధంగా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా సాధించిన అద్భుతమైన విజయానికిగానూ ఆటగాళ్లను అభినందిస్తున్నాను. అసాధారణమైన ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేశారు. ఇప్పటికే 2-1తో సిరీస్ ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి టెస్టులోనూ ఉత్తమంగా రాణిస్తుందని ఆశిస్తున్నా" అని జైషా అన్నారు.
ఇదీ చూడండి..ఐపీఎల్లో ఎయిర్ అంబులెన్స్- 30 వేల RT-PCR కిట్లు