భారత్-పాక్ మ్యాచ్ అంటే తెలుసుగా.. మామూలుగా ఉండదు! ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహంతో ఇళ్లలో బద్దలయ్యే టీవీలు.. ఓటమి బాధతో కొన్నిసార్లు (T20 world cup 2021) ఊపిరే ఆగిపోయే సందర్భాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయంటే.. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. అంతకుమించి! ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. అదొక ఒక పండుగలా మారి దేశమంతా సంబరాలు చేసుకుంటుందంటే.. అతిశయోక్తి కాదు. అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో (india vs pakistan match) దేశంలో క్రీడోత్సాహం నెలకొంది. అభిమాన జట్టు విజయం సాధించాలని పూజలు, హోమాలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు క్రీడాప్రేమికులు. ఒకరు రంగోళీలు, మరొకరు ఒంటి నిండా జాతీయ జెండా రంగు పూసుకుని.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రంగోళీతో..
ఇందోర్‌కు చెందిన కళాకారుల బృందం రంగోళీని తయారు చేసింది. భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. 7,700 చదరపు అంగుళాల రంగోళీకి రూపకల్పన చేశారు. 20 మంది ఉన్న ఈ బృందం.. 3 క్వింటాళ్ల రంగులతో 45 గంటలు కష్టపడి దీనిని రూపొందించారు. రోహిత్ శర్మ, ధోనీ, విరాట్ కోహ్లీ చిత్రాలతో ఈ రంగోళీని తీర్చిదిద్దారు.
ఒంటి నిండా రంగుతో..
భారత జట్టుకు మద్దతు తెలుపుతూ అహ్మదాబాద్‌లో ఓ అభిమాని శరీరాన్ని ఇలా రంగులతో ముంచేశాడు. టీమ్ఇండియా విజయం సాధించాలని ఆకాంక్షించాడు. జాతీయ జెండాను చేతపట్టి.. తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.
హోమం..
ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయంతో స్వదేశానికి తిరిగిరావాలని బెంగళూరులో హోమం నిర్వహించారు అభిమానులు. పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్ ఆడి టోర్నీలోకి అడుగు పెట్టనున్న భారత జట్టుకు మద్దతును ఇలా తెలుపుతున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఫొటోలతో కూడిన బ్యానర్‌ను తయారు చేసి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.