Syed Mushtaq Ali Trophy 2023 Final :2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్స్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన తుదిపోరులో పంజాబ్.. బరోడాపై 20 పరుగుల తేడాతో నెగ్గి తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటంగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్థి ముందు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. యంగ్ బ్యాటర్ అభిమన్యూ సింగ్ (61), కెప్టెన్ కృనాల్ పాండ్య (45) రాణించినా ఫలితం దక్కలేదు. దీంతో బరోడా జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4, సిద్ధార్థ్ కౌల్ , మయంక్ మార్కండే, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
భారీ లక్ష్య ఛేదనలో బరోడా రెండో ఓవర్లోనే ఓపెనర్ జ్యోత్స్నిల్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ నినాద్ రావత్ (47 పరుగులు, 22 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. అతడికి తోడు అభిమన్యూ సింగ్, కృనాల్ పాండ్య పోరాడారు. కానీ, కావల్సిన రన్‌రేట్ అంతకంతకూ పెరుగుతుండడం వల్ల.. బరోడా చివర్లో టపటపా వికెట్లు కోల్పోయింది. చివర్లో విష్ణు సోలంకి (28 పరుగులు, 11 బంతుల్లో, 3x4, 2x6) మెరుపులు మెరిపించి.. బరోడా శిబిరంలో ఆశలు రేపాడు. అతడిని హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ విజయం ఖరారైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (9) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ (113 పరుగులు, 61 బంతుల్లో) సూపర్ సెంచరీకి, నెహాల్ వధేరా (61 పరుగులు, 27 బంతుల్లో) మెరుపులు తోడవడం వల్ల పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.