తెలంగాణ

telangana

ETV Bharat / sports

Syed Mushtaq Ali T20: ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక.. హైదరాబాద్​కు నిరాశ - సయ్యద్ ముస్తాక్ అలీ తమిళనాడు

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. తమిళనాడు, కర్ణాటక మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు (నవంబర్ 20) జరిగిన సెమీస్ మ్యాచ్​ల్లో హైదరాబాద్​పై తమిళనాడు, విదర్భపై కర్ణాటక విజయం సాధించాయి.

syed mushtaq ali
తమిళనాడు

By

Published : Nov 20, 2021, 4:50 PM IST

Updated : Nov 20, 2021, 5:00 PM IST

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ కథ ముగిసింది. గ్రూపు మ్యాచ్​ల్లో వరుస విజయాలతో జోరు చూపించిన జట్టు.. సెమీస్​లో తమిళనాడు చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో ఈసారి కూడా ట్రోఫీ కలగానే మిగిలిపోయింది.

తమిళనాడుతో జరిగిన సెమీస్​లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ తడబడింది. తమిళనాడు బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. తనయ్‌ త్యాగరాజన్‌ (25) తప్ప మిగతావారెవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టోర్నీలో టాప్ స్కోరర్​గా ఉన్న హైదరాబాద్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ ఈ మ్యాచ్​లో ఒక పరుగుకే వెనుదిరిగి నిరాశపర్చాడు. తమిళనాడు బౌలర్‌ శరవణ కుమార్‌ 5 వికెట్లతో సత్తాచాటగా.. మురుగన్ అశ్విన్‌, మహ్మద్‌ చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ విజయ్‌ శంకర్‌ (43*), సాయి సుదర్శన్‌ (34*) జట్టుకు గెలుపునందించారు. ఈ విజయంతో తమిళనాడు వరుసగా రెండో సీజన్​లో (2019 తర్వాత) ఫైనల్లో ప్రవేశించింది.

కర్ణాటక విజయం

ఇక రెండో సెమీ ఫైనల్లో విదర్భను ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది కర్ణాటక. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్​లో రాణించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహన్ కదమ్ (87), మనీష్ పాండే (54) తొలి వికెట్​కు 132 పరుగుల భాగస్వామ్యం జోడించి మంచి శుభారంభాన్నిచ్చారు. తర్వాత అభినవ్ (27) పర్వాలేదనిపించగా 176 పరుగులకు పరిమితమైంది కర్ణాటక.

అనంతరం లక్ష్య చేధనలో విదర్భకు శుభారంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు ఓపెనర్లు అథర్వ (32), గణేశ్ సతీష్. కానీ 43 పరుగులు జోడించాక అథర్వను పెవిలియన్ చేర్చాడు కరియప్ప. అనంతరం గణేశ్ (31)తో కలిసి అక్షయ్(15) కాసేపు పోరాడాడు. కానీ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన కర్ణాటక బౌలర్లు ఏ చిన్న అవకాశం ఇవ్వలేదు. చివర్లో అపూర్వ (27), కర్నేవర్ (22) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసి 4 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

2019 రిపీట్

2019-20లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఫైనలిస్టులుగా పోటీపడిన కర్ణాటక, తమిళనాడు మరోసారి ఈ టోర్నీ చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్ ఫైనల్లో తమిళనాడుపై గెలిచి విజేతగా నిలిచింది కర్ణాటక. ఇక 2020-21 సీజన్లో బరోడాపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది తమిళనాడు.

ఇవీ చూడండి: ఇండోనేషియా మాస్టర్స్​ సెమీస్​లో సింధు ఓటమి

Last Updated : Nov 20, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details