టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వార్మప్ హైఓల్టేజీ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటం వల్ల మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. ఆఖరి ఓవర్‌లో షమీ తమ మ్యాజిక్‌తో 3 వికెట్లతో కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆసీస్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌తో మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డై.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేయగానే అక్షర్‌తో మాట్లాడతూ.. ఇవాళ భారీ షాట్లు ఆడే మూడ్ లేదని అన్నాడు. అలా చెప్పిన తర్వాత బంతికే బంతికే ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సూర్యపై ప్రశంసలు.. ఇక భారత్ ఇన్నింగ్స్ ముగిశాక.. రిచర్డ్‌సన్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్ ఉత్తమ ఆటగాడని కొనియాడాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి అతడికి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ పెవిలియన్‌కు చేరాడు.
"సూర్యకుమార్ యాదవ్ మా జట్టుపై తొలిసారి బ్యాట్‌కు బంతి మిడిల్ కాకుండా ఔట్ కావడం ఇదే మొదటిసారని అనుకొంటున్నా. ఇప్పుడున్న టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్ అత్యుత్తమం. అలాంటి ఆటగాడి వికెట్‌ను తీయడం బాగుంది. ఇక నా బౌలింగ్‌కు వస్తే.. ఇలాగే ప్రారంభించాలని ఏమీ అనుకోలేదు. ఫామ్‌తో ఉంటే ఒకలా.. గాయడిపతే మరోలా జరగడం సహజం. అయితే ఇవాళ మంచిగా బౌలింగ్ చేయడం సంతోషంగా ఉంది. మధ్య ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా వేశారు. అయితే వార్మప్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులతో లేని స్టేడియాల్లో ఆడాల్సి వస్తోంది. ఇదొక్కటే కాస్త నిరుత్సాహ పరించింది. అయితే సిసలైన పోరులో మాత్రం భారత్‌తో మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు ఉంటారని భావిస్తున్నా" అని రిచర్డ్‌సన్ వెల్లడించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధశతకాలు సాధించారు. హార్దిక్ పాండ్య (2) విఫలం కాగా.. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), దినేశ్ కార్తిక్ (20) ఫర్వాలేదనిపించారు. దీంతో టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 6*, రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ 4.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో భారత్‌కు దీటుగా ఆడింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(35), ఆరోన్ ఫించ్(76) అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. స్మిత్(11), మ్యాక్స్‌వెల్(23), స్టోనిస్(7), టిమ్ డేవిడ్(5), కమ్మిన్స్(7), ఇంగ్లిష్(1), అగర్, స్టార్క్(0), కేన్ రిచర్డ్‌సన్(0) పరుగులు చేశారు. కాగా, చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన భారత బౌలర్ మహ్మద్ షమీ.. 20వ ఓవర్లో నిప్పులు చెరిగాడు. ఒక్క ఓవరే వేసినప్పటికీ.. యార్కర్లతో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో మొత్తం మూడు వికెట్లు తీశాడు. అదనంగా ఓ రనౌట్ సైతం నమోదైంది.
ఇదీ చూడండి: ఏడు టీ20 ప్రపంచకప్‌లు.. 'గోల్డెన్ డక్'లు ఎన్నంటే?