టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబయి వీధుల్లో సందడి చేశాడు. అక్కడి చిన్నారి అభిమానుల కోరిక మేరకు గల్లీ క్రికెట్ ఆడిన సూర్యకుమార్.. సుప్లా షాట్ కొట్టి అలరించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడిన సూర్యకుమార్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఇలా ముంబయి వీధుల్లో కనిపించి సందడి చేశాడు. తన అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు.
అక్కడున్న చిన్నారుల కోరిక మేరకు ఇలా బ్యాట్ పట్టిన స్కై.. ఆ తర్వాత వారితో కాసేపు ముచ్చటించాడు. ఆ వీడియోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. 'ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడుతున్న సూర్యా భాయ్' అంటూ క్యాఫ్షన్ను సైతం జోడించింది. దీనికి మిస్టర్ 360 సైతం స్పందించాడు. 'నా సోదరుల డిమాండ్ మేరకు సుప్లా షాట్ ఆడాను' అంటూ రాసుకొచ్చాడు. ఇండియన్ టీమ్‌లోని మేటి ప్లేయర్లలో ఒక్కడైన సూర్యకుమార్ మైదానంలో బాల్‌ను ఓ ఆటాడుకుంటాడు. స్టేడియం అన్ని వైపులా షాట్లు కొడుతుంటాడు. అందుకే అభిమానులు అతన్ని మిస్టర్ 360 అని పిలుచుకుంటారు.
అంతర్జాతీయ క్రికెట్‌తో అరంగేట్రం చేసిన స్కై రెండేళ్లకే సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. 2022లోనే 1000కి పైగా పరుగులు సాధించి అందరిని ఆకర్షించాడు. టీ20 ఫార్మాట్‌లో నంబర్ 1 ర్యాంకు సాధించి.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, నాగ్‌పూర్ వేదికగా జరగిన టెస్టులో సూర్య విఫలమయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్కై కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్ లైయన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు.
అయితే 30 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు సూర్య కుమార్ యాదవ్. ఇక రెండో టెస్టుకు అయ్యర్ తిరిగివచ్చేయడం వల్ల సూర్య కుమార్‌కు కాస్త విశ్రాంతి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఆ తర్వాత మంబయిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇక అన్నీ ఫార్మాట్లోనూ దుమ్ములేపే స్కై.. ఐపీఎల్లో మరోసారి విజృంభించాలంటూ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని మెరుపు షాట్లను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా రానున్న సీజన్లో ముంబయి ఇండియన్స్ టీమ్ తన తొలి మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.