ప్రపంచ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ జోరు కొనసాగించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టును సునాయాసంగా చిత్తు చేసి మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్‌పై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కన్నా జట్టులో సూర్య ప్రమాదకర ఆటగాడని, అతడితో ఆడేటప్పుడు తానెంతో ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు.
'టీమ్‌ఇండియాలో రోహిత్, కోహ్లీ కన్నా అతడు చాలా డేంజర్'
టీమ్ఇండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్‌పై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే?
"సూర్యకుమార్ బ్యాటింగ్ గురించి మనందరికీ తెలిసిందే. గత సంవత్సర కాలంగా అతడు నిలదొక్కుకున్న వేగం చూసి అతడెంత ప్రమాదకర ఆటగాడో చెప్పొచ్చు. విరాట్, రోహిత్‌లు వారి శైలిలో గొప్పగా ఆడతారు. అయితే వారితో పోలిస్తే ఈ ఆటగాడిలో పొరపాట్లకు ఆస్కారం చాలా తక్కువ. బౌలింగ్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రోహిత్ కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడాడు. కానీ మైదానంలో ఈరోజు సూర్య చెలరేగిపోయాడు. ఈ బ్యాటర్‌తో ఆడుతున్నప్పుడు నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. టీమ్‌ఇండియాతో ఆటంటే ఇలాగే ఉంటుంది" అంటూ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటుగా సూర్య అర్థసెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆదివారం జరగనున్న మూడో మ్యాచ్‌లో సఫారీ సేనతో భారత్ తలపడనుంది.