ఫాస్ట్ పిచ్‌లు అంటే టీమ్ ఇండియాకు భయం.. 'అందరికీ ఏదైతో భయమో ముందు అదే చేసేయడం నాకు అలవాటు' అన్నట్లుంటుంది సూర్యకుమార్ యాదవ్ (స్కై) తీరు. షార్ట్‌కట్లు అతడికి తెలియవు. పేస్ పిచ్‌లంటే భారత బ్యాట్స్‌మన్‌కు భయం అనే అపవాదు ఎన్నో ఏళ్లుగా ఉంది. కానీ, మనవాడు అటువంటి పిచ్‌లపై కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఇటీవల జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సులే దీనికి ఉదాహరణ. ప్రపంచకప్ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో సరికొత్త సూపర్ స్టార్‌గా ఉదయించాడు. నిలకడగా 180కిపై స్ట్రైక్ రేట్‌తో 59 సగటుతో ఆరు మ్యాచ్‌ల్లో 239 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏ బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్ అతడి దరిదాపుల్లో కూడా లేదు. నిలకడగా అంత స్ట్రైక్‌రేట్ సాధించడం సాధారణ విషయం కాదని సాక్షాత్తూ కోచ్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అతడికి ఈ ప్రతిఫలం ఏదో ఒక్క రోజుతో వచ్చింది కాదు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకొంటూ.. బలహీనతలను జయిస్తూ భారత్ క్రికెట్‌లో వెలిగిపోతున్నాడు స్కై.
బౌలింగ్ పిచ్ చేయించుకొని మరీ సాధన.. సూర్యకుమార్ యాదవ్ సాధన మొత్తం ముంబయిలో పార్సీ జింఖానా మైదానంలోనే జరుగుతుంది. అక్కడి సెక్రటరీ ఖోడాదాద్‌ను అడిగి మరీ పచ్చికతో కూడిన పేస్ బౌలింగ్ పిచ్‌ను చేయించుకొన్నాడు. అంతర్జాతీయ, ముంబయి క్రికెట్ జట్టు మ్యాచ్‌లు లేని సమయంలో కూడా సూర్యా అక్కడకు వచ్చి సాధన చేస్తాడు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండే కఠినమైన వికెట్లపై ప్రాక్టీస్ సాగుతుంది. దీంతో ఎంతటి కఠినమైన బౌలింగ్‌నైనా కకావికలం చేసేస్తాడు. పేస్ బౌలర్ల నుంచి 430 బంతులను ఎదుర్కొని 834 పరుగలు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 190..! ఈ గణాంకాలు చూస్తే అతడి సాధన వ్యూహం ఎంతగా ఫలితాలనిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అన్నిరకాల బౌలర్లూ ఉండాల్సిందే.. కేవలం సీమర్లనే కాదు.. స్పిన్నర్లు.. మీడియం పేసర్లను కూడా ఎదుర్కోవడానికి సూర్యా ఎప్పుడూ సన్నద్ధమవుతాడు. ఏ బౌలర్‌కు బలహీనంగా కనిపించకూడదనేది అతడి నియమం. సూర్యా సాధన సెషన్ కోసం అతడి బృందం.. అన్ని రకాల బౌలర్లను సిద్ధం చేస్తుంది. వీరిలో లెఫ్టార్మ్, రైటార్మ్ పేసర్లు, లెఫ్ట్మార్మ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ అందుబాటులో ఉండేలా చూసుకొంటారు. వీరితోపాటు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్ ఓం కూడా అందుబాటులో ఉంటాడు.
పరిస్థితులను సృష్టించుకొని సూర్యా బ్యాటింగ్ చేస్తాడని అతడి కోచ్, సహచరుడు వినాయక్ మానె వెల్లడించారు. వివిధ రకాల బౌలర్లు అందుబాటులో ఉండటంతో పవర్ ప్లేలో ఎలా ఆడాలి.. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తాడు. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో బౌలర్లతో చర్చిస్తాడు.. మరేవిధంగా ప్రయత్నించవచ్చో తెలుసుకొంటాడు.