Suryakumar Yadav 4th T20 :సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రఫ్పాడించాడు. అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌తో (100 పరుగులు : 56 బంతులు 7x4, 8x6) బౌండరీల మోత మొగిస్తూ సెంచరీ బాదేశాడు. టీ20ల్లో సూర్యకు ఇది 4వ సెంచరీ. దీంతో టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4) రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. మరోవైపు యంగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (60 పరుగులు : 41 బంతుల్లో, 6x4, 3x6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత ఆటతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. సఫారీ బౌలర్లలో లియాద్ విలియమ్స్ 2, కేశవ్ మహరాజ్ 2, షంసీ, బర్జర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
గిల్ మరో'సారీ' :టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు పేలవ ఆరంభం దక్కింది. గత మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (12) ఈ మ్యాచ్‌లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య, జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ జోడీని స్పిన్నర్ షంసీ విడగొట్టాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ (14) వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక చివరి ఓవర్లో సూర్య 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకొని తరువాతి బంతికి క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు.