ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా టీ20 క్రికెట్‌లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లకు పురస్కారాన్ని అందించే దిశగా పురుషుల 'టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉండగా.. అందులో టీమ్ఇండియా నయా సంచలనం సూర్యకుమార్ కూడా చోటు సంపాదించాడు. ఇంకా ఈ లిస్ట్‌లో ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఉన్నారు.
సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్లో వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో.. 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ పొట్టి క్రికెట్‌లో సూర్య అత్యధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు.