పురుషుల టీ 20 కొత్త ర్యాంకింగ్స్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. తాజా జాబితాలో.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవే మళ్లీ మొదటి స్థానంలో (906) నిలిచాడు. అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ బౌలర్ల లిస్ట్‌లో (710) పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబల్ హసన్ మొదటి స్థానంలో ఉండగా.. భారత ఆటగాడు హార్దిక్ పాండ్య రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ విభాగంలో 906 పాయింట్లతో సూర్య అగ్ర స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్.. రిజ్వాన్‌కు మధ్య 100 పాయింట్ల తేడా ఉంది. బాబార్ అజమ్ 755 పాయింట్లు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మర్క్రమ్ 748 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. ఇక టాప్ పదిలో మరే ఇతర భారత ఆటగాడికి స్థానం దక్కలేదు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 వ స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ దేశ ఆటగాళ్లు రషీద్ 710 పాయింట్లు, ఫారూకీ 692 పాయింట్లుతో వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. అదే దేశానికి చెందిన ముజీబ్ రహమాన్ 669 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే టాప్ పదిలో భారత బౌలర్లకు చోటు దక్కలేదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ 14 వ స్థానంలో ఉండగా.. భువనేశ్వర్ 19 వ స్థానానికి పడిపోయాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ 269 పాయింట్లతో ముందుండగా.. టీమ్ ఇండియా హార్డ్ హిట్టర్ హర్దిక్ పాండ్య 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా మూడు విభాగాల్లో కలిపి భారత్ నుంచి సూర్య, హర్దిక్ ఇద్దరు మాత్రమే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ పదిలో ఉన్నారు.
ఐపీఎల్లో ఫెయిల్.. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ బౌలర్లను బెంబేలెత్తించే సూర్య... ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడి సూర్య 13.2 సగటుతో కేవలం 66 పరుగులే చేశాడు. ఇక ముందైనా పాత ఫామ్‌ను అందుకుని సూర్యభాయ్‌ను గుర్తుచేసేలా పరుగుల వరద పారించాలని సూర్య ఫాన్స్ ఆశిస్తున్నారు.