Surya Kumar Yadav ODI : ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 277 పరుగుల లక్ష్యానికి బరిలోకి దిగిన రాహుల్ సేన.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఇక ఓపెనర్లుగా రంగంలోకి దిగిన శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీ భాగస్వామ్యం అందించగా... కెప్టెన్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో తొలి పోరులోనే సత్తా చాటిన భారత జట్టు సునాయాసంగా ఒక పాయింట్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టంతా సూర్యకుమార్ యాదవ్‌పై పడింది.
Surya Kumar Yadav Australia Series : గత కొంత కాలంగా టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్న మిస్టర్ 360.. వన్డేల్లో మాత్రం భిన్నమైన శైలిలో ఆడుతున్నాడు. చేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే ఆటతీరును కొనసాగించాడు. అతని ఆట తీరులో ఏ మాత్రం మార్పు లేనుందున.. ఆసియాకప్‌కు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో వన్డేల్లో ఇక సూర్యకుమార్ ఛాప్టర్ ముగిసిందని అందరూ అనుకున్నారు.
కానీ టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అలా ఈ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సూర్యను ఎంపిక చేశారు. అయితే ద్రవిడ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సూర్యకుమార్ నిలబెడుతూ.. తొలి వన్డేలో అర్ధశతకంతో చెలరేగిపోయాడు. కీలక సమయంంలో క్రీజులోకి దిగిన సూర్యకుమార్.. అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్య 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 పరుగులు సాధించాడు. తన స్కోర్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.