Surya Kumar Yadav ICC T20 Ranking : తీవ్రమైన ఒత్తిడి ఉండే స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. బెదురు లేకుండా ఆడగలుగుతున్నానంటే అది జట్టు యాజమాన్యం ఇచ్చిన స్వేచ్ఛ వల్లేనని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. 360 డిగ్రీల ఆటతో టీ20ల్లో చెలరేగుతున్న సూర్య.. తాజాగా ర్యాంకింగ్స్‌లో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ "ఎంతో ఒత్తిడి ఉండే స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను. ఆరంభం నుంచే దూకుడుగా, భయం లేకుండా ఆడే స్వేచ్ఛను జట్టు యాజమాన్యం ఇచ్చింది. అది ఏ బ్యాటర్‌కైనా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అందుకే బరిలో దిగిన ప్రతిసారీ దూకుడుగానే బ్యాటింగ్ చేస్తా. ఈ క్రమంలో త్వరగా ఔటైనా బాధపడను. ఎందుకంటే పదిసార్లలో కనీసం ఏడుసార్లనా విజయవంతం అవుతా" అని సూర్య చెప్పాడు.
కఠోర శ్రమ వల్లే టీ20ల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచినట్లు సూర్య తెలిపాడు. "టీ20ల్లో నంబర్‌వన్ బ్యాటర్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. కఠోర శ్రమ వల్లే ఇది సాధ్యమైంది. నంబర్‌వన్ కావడం చాలా కష్టం. ఈ ర్యాంకు నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. నాకిదో సవాల్. కానీ వందశాతం ప్రయత్నిస్తా" అని సూర్య తెలిపాడు. ప్రత్యర్థి ఎవరైనా తన బ్యాటింగ్ మారదని.. ఆదివారం జింబాబ్వేతో పోరులోనూ ఇలాగే ఆడతానని సూర్య చెప్పాడు.