ఇంగ్లాండ్‌తో రద్దైన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయాలనే బీసీసీఐ (eng vs ind) ప్రతిపాదనను స్వాగతించాడు టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. 2008లో ఇంగ్లాండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని చెప్పాడు. నవంబర్ 26న ముంబయి ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ మళ్లీ భారత్‌కు తిరిగొచ్చిందని గుర్తుచేశాడు.
ఇదీ జరిగిందీ..
2008లో దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్‌లో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. 7మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు వన్డేలను రద్దు చేయడం వల్ల ఇంగ్లీష్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో ఆ తర్వాత జరగాల్సిన 2మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది.
అయితే టెస్టు సిరీస్ ఆడటానికి మళ్లీ భారత్‌కు తిరిగొచ్చింది ఇంగ్లాండ్. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్, ముంబయిలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైకి వేదికలను మార్చారు. ఈ సిరీస్‌లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టును 1-0తో టీమ్ఇండియా ఓడించింది.
"మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేయడం సరైన నిర్ణయం. 26/11 దాడి తర్వాత ఇంగ్లాండ్ చేసిన పనిని భారత్ మర్చిపోకూడదు. వారు తిరిగొచ్చారు. 'భారత్‌లో భద్రత ఉంటుందని భావించడం లేదు. అందుకే మేము రావడం లేదు' అని చెప్పే పూర్తి హక్కు నాడు ఇంగ్లాండ్‌కు ఉంది. కానీ, కెవిన్ పీటర్సన్ అలా జరగనివ్వలేదు. అతడే అందరితో మాట్లాడి మ్యాచ్ ఆడటానికి ఒప్పించాడు. అందుకు ఈసీబీని కూడా అభినందించాలి."