Kohli Rohit: టీమ్ఇండియా మ్యాచ్‌ల్లో డీఆర్ఎస్ ఉపయోగించడంలో మహేంద్రసింగ్ ధోనీని మించిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతలా అంటే డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనే పిలిచేంతలా పాపులర్ అయింది. ఇప్పుడు దానికి కొత్త పేరు పెట్టాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గావస్కర్.
ఇంతకీ ఏం జరిగిందంటే?
గత కొన్నేళ్ల విరాట్ కెప్టెన్సీలో ఆడిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో తొలిసారి పూర్తిస్థాయి సారథిగా మారాడు. తొలి మ్యాచ్‌తోనే అద్భుత విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సందర్భంలో కోహ్లీ ఒక్క మాట చెప్పగానే.. రోహిత్ మరేం ఆలోచించకూడా డీఆర్ఎస్ కోరి సక్సెస్ అయ్యాడు.
ధోనీ-కోహ్లీ.. కోహ్లీ-రోహిత్ విండీస్ ఇన్నింగ్స్‌లోని 22వ ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో బ్రూక్స్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల చాహల్ విసిరిన బంతి.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. భారత క్రికెటర్లు ఔట్ కోసం అప్పీలు చేయగా, అంపైర్ నిరాకరించాడు.
అనంతరం డీఆర్ఎస్ కోరే ముందు కెప్టెన్ రోహిత్.. పంత్ ఒపీనియన్ అడగ్గా అతడు స్పష్టంగా చెప్పలేకపోయాడు. వెంటనే కోహ్లీ వచ్చి తీసుకోమని చెప్పగా, రోహిత్ మరేం ఆలోచించకుండా డీఆర్ఎస్ తీసుకుని విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో కామెంటరీ చేస్తున్న సునీల్ గావస్కర్.. ఇకపై డీఆర్ఎస్ అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్' కాదని.. 'డెఫినిట్లీ రోహిత్ సిస్టమ్' అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 176 పరుగులు చేయగా, భారత్ దానిని 28 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకునే బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ మరోసారి తక్కువ పరుగులే చేసి, ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
ఇవీ చదవండి: