Sunil Gavaskar on Indian Team: కంగారూల గడ్డపై భారత జట్టు తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా సాధించిన విజయాల్లో ఇదే అత్యంత గొప్ప విజయమని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు గాయాల పాలైనా.. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో రాణించి ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించారని ప్రశంసించాడు.
"తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో పుంజుకున్న తీరు అద్భుతం. ఆ మ్యాచులో భారత్ సాధించిన విజయం ఆటగాళ్ల దృఢ సంకల్పానికి నిదర్శనం. సిరీస్ ఆసాంతం ఆదిపత్యం చెలాయించి కంగారూల గడ్డపై సిరీస్ సాధించడమనేది భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. అలాంటి చారిత్రక విజయాన్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను."
-- సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.
ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి త్వరలో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా.. 'డౌన్ అండర్‌గోస్ - ఇండియాస్ గ్రేటెస్ కమ్‌బ్యాక్' అనే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను జనవరి 14 నుంచి 'సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్' ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా భారత్ సాధించిన ఘన విజయంపై సునీల్ గావస్కర్ తన అభిప్రాయాలను సోనీ స్పోర్ట్స్ ఛానల్‌తో పంచుకున్నారు.