ఎన్నో రికార్డులను సాధించిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్(Gavaskar).. తనదైన శైలి ఆటతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆటకు సంబంధించిన మెలకువలను, విలువైన సలహాలను ఇస్తూ ఇప్పటికీ ఎంతో మంది క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచిన అతడు.. కామెంటేటర్‌గానూ సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఎందుకు కోచ్‌గా వ్యవహరించలేదో వెల్లడించాడు.
"నేను మైదానంలో ఆడేటప్పుడు సహా మిగతా సమయాల్లోనూ క్రికెట్‌ను చాలా ఎక్కువగా చూస్తాను, గమనిస్తాను. అయితే ఒక్కసారి అందులో నుంచి బయటకు వస్తే మాత్రం అడపాదడపా చూస్తాను. మిగతా వ్యాపకాలతో కొంచెం బిజీ అయిపోతాను. జీఆర్ విశ్వనాథ్ లేదా మాధవ్ మంత్రిలా ప్రతి బంతిని క్షుణ్ణంగా పరిశీలించలేను. ఒకవేళ కోచ్ లేదా సెలక్టర్ అవ్వాలని అనుకుంటే మ్యాచ్‌లోని ప్రతిబంతిని క్షుణ్ణంగా గమనించగలగాలి. అయినా నేనెప్పుడు కోచ్ అవ్వాలని అనుకోలేదు"
-గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్