Gavaskar comments on Rahane Pujara: ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇక టెస్టు క్రికెట్‌లో కొనసాగాలంటే చివరగా ఒక్క అవకాశమే మిగిలి ఉందని మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మరోసారి విఫలమవడం వల్ల ఈ వ్యాఖ్యలు చేశాడు.
"పుజారా, రహానే వరుస బంతుల్లో విఫలమవ్వడం చూస్తే.. సగటు వ్యక్తి ఎవరైనా.. వాళ్లు టెస్టుల్లో కొనసాగడానికి ఇక ఒక్క అవకాశమే మిగిలి ఉందని అనుకుంటారు. జట్టులో వారి స్థానాలపై ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వడం విచారకరం. ఇకపై వాళ్లు టీమ్ఇండియాలో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడటం ఒక్కటే వారు చేయాల్సింది" అని గావస్కర్ అన్నారు.