IPL Gavaskar Kohinoor Diamond: తనదైన శైలిలో హాస్యాన్ని జోడిస్తూ అద్భుతంగా కామెంటరీ చేస్తాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. కొన్ని సందర్భాల్లో ఆ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారగా మరి కొన్ని సార్లు అవి తెగ నవ్విస్తాయి. తాజాగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులోనూ గావస్కర్ మరోసారి తన హాస్యచతురతను ప్రదర్శించాడు.
బ్రేక్ సమయంలో ముంబయిలోని మెరైన్ డ్రైవ్‌ను అక్కడి స్క్రీన్‌పై ప్రసారం చేస్తుండగా దాని గురించి వర్ణించాలని మరో ఇంగ్లీష్ కామెంటేటర్ అలన్ విల్కిన్స్.. గావస్కర్‌ను కోరాడు. వెంటనే స్పందించిన సన్నీ.. దాన్ని బ్రిటీష్ మహారాణి దగ్గర ఉన్న కోహినూర్ డైమండ్‌తో పోల్చాడు. "ఇంతకీ ఆ కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది. మేము ఇంకా దాని కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. నీకేమైనా(అలన్ విల్కిన్స్) ప్రత్యేక పలుకుబడి ఉంటే దాన్ని ఉపయోగించి బ్రిటీష్ ప్రభుత్వంతో మాట్లాడి.. ఆ విలువైన వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇప్పించేలా చేయ్" అని అన్నాడు. ఈ సంభాషణలు క్రికెట్ లవర్స్‌ను విపరీతంగా నవ్వించాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విపరీతంగా తమదైన శైలిలో జోకులు వేస్తూ పంచ్‌లు పేల్చారు.