Sunil Gavaskar About Team India : రానున్న కొద్ది రోజుల్లో కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి. ఇక దీనికి ముందే వెస్టిండీస్ చేతిలో టీమ్ఇండియా టీ20 సిరీస్ ఓటమిపాలైన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లకు కనీసం అర్హత సాధించని కరేబియన్ జట్టు పై కూడా గెలవలేని పరిస్థితుల్లో మన జట్టు ఉందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ మాజీలు సైతం రోహిత్ సేనపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా టీమ్ఇండియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
"ఓ ప్లేయర్ ఫ్రాంఛైజీ స్థాయిలో బాగానే ఆడుచ్చు. కానీ దేశానికి ప్రాతినిథ్యం వహించినప్పుడు మాత్రం తన ఆటతీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లపై ఉండే ఒత్తిళ్లు, అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. ఈ స్థాయిలో ఫ్రాంఛైజీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన ఆటగాళ్లు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. అండర్ 19లో ఇరగదీసిన యువ ఆటగాళ్లు పురుషుల క్రికెట్లో విఫలమవ్వడం మనం ఎన్నిసార్లు చూడలేదు" అంటూ ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు రాసిన కాలమ్‌లో గావస్కర్ పేర్కొన్నాడు. అయితే సునీల్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడన్న విషయంపై క్లారిటీ లేదు.
"పిల్లలు పిల్లలతో ఆడినప్పుడు బాగానే అనిపిస్తారు. కానీ మగాళ్లతో ఆడినప్పుడే తడబడతారు. అండర్ 19 క్రికెట్లో ఓ కేకులా అనిపించింది కూడా ఇక్కడ చూస్తే బురదలా అనిపిస్తుంది. అందుకే కుర్రాళ్లు క్రికెట్లో రాణించిన ఎంతో మంది ప్లేయర్లు పురుషుల క్రికెట్లో విఫలమయ్యారు. ఇక ఫ్రాంఛైజీ లెవల్లో అవసరమైన స్కిల్స్ చాలా తక్కువగానే ఉంటుంది. కోట్లు పెట్టి ఫ్రాంఛైజీలు తమను కొనుగోలు చేసి ఈ యువకులు ఎలాగైనా రాణించాలన్న కసి కోల్పోతారు. ఆ తర్వాత తమ ఆట పతనమైనా అవే ఫ్రాంఛైజీలకు తక్కువ మొత్తాలకు కూడా కాంట్రాక్ట్ పై సంతకాలు చేస్తారు" అని గావస్కర్ అన్నాడు.