ఎంఎస్ ధోనీ(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు ఏం జరిగిందో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) వివరించాడు. అతడు వీడ్కోలు పలుకుతాడన్న సంగతి జట్టులో ఎవరికీ తెలియదని పేర్కొన్నాడు. రాత్రి అందరిలాగే సోషల్ మీడియా ద్వారా తమకు విషయం తెలిసిందన్నాడు. మహీ ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడడని అర్థమయ్యేందుకు రెండు మూడు రోజులు పట్టిందన్నాడు.
"నిజానికి ఆ రోజు మేం దుబాయ్‌కు బయల్దేరాలి. చెన్నైలో ధోనీతో కలిసి 10-15 మంది సాధన చేశారు. కానీ అందులో ఎవరికీ ఈ విషయం తెలియదు. ఆ ఆగస్టు 15 కూడా మిగతా రోజుల్లాగే గడిచింది. సీఎస్‌కేలోని ఇతర ఆటగాళ్లలాగా నాకూ సోషల్ మీడియా ద్వారానే ధోనీ వీడ్కోలు గురించి తెలిసింది. ఆ రోజు సాయంత్రం 6:30కి సాధన ముగిసింది. మహీభాయ్ తప్ప మిగతా అందరం 7 గంటలకు భోజనం వద్ద కూర్చున్నాం. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహీ వీడ్కోలు పలికాడని ఎవరో చెప్పారు. భయంతో ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు."
- రుతురాజు గైక్వాడ్, చెన్నైసూపర్‌కింగ్స్ ఓపెనర్