సౌథాంప్టన్ వేదికగా.. భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభంకానుంది. 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను శిఖరాగ్రంపై నిలబెట్టే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు భారీ వ్యుహాలనే రచించాయి. కనీసం మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కోహ్లీసేన, ఇంగ్లాండ్‌ను 1-0తో ఓడించిన ఉత్సాహంతో విలియమ్సన్ బృందం సమరానికి సిద్ధమయ్యాయి. మ్యాచ్ విన్నర్లు, స్టార్లు ఇరువైపులా ఉండడంతో... బలాబలాలపరంగా ఇరుజట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి.
టీం ఇండియా బలబలాలు..
ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు కోహ్లీసేన వద్ద అపారమైన వనరులున్నాయి. న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ సంధించే షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కొని నిలిచేందుకు చెతేశ్వర్ పుజారా పూర్తిగా సన్నద్ధమయ్యాడు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానె రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో పరుగులు పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొత్తబంతితో మాయచేసే ట్రెంట్‌బౌల్ట్, టిమ్ సౌథీ జోడీని సమర్థంగా ఎదుర్కొనేందుకు నెట్స్‌లో విరామం లేకుండా శ్రమించారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూకుడు, టెక్నిక్‌కు ఇంగ్లాండ్ పర్యటన పరీక్ష పెట్టనుంది. దేశ విదేశాల్లో అపార అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత్ జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. వివిధ కోణాల్లో యార్కర్లు, వైవిధ్యమైన బంతులు వేసే జస్‌ప్రీత్ బుమ్రాను నిలువరించడం కివీస్ బ్యాట్స్‌మెన్‌కు అంత సులభమేమీ కాదు. మహమద్ షమి లేట్ స్వింగ్‌ను ఆడటం ఎవరికైనా సవాలే. ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించగల జడేజా, స్పిన్ ఉచ్చులో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయగల అశ్విన్ మరోసారి తమ సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నారు.
కివీస్ తక్కువేం కాదు..
న్యూజిలాండ్ వద్ద దిగ్గజ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటివరకూ ఆడని ఆరు అడుగుల 9 అంగులాల కైల్ జేమీసన్‌ను విలయమ్సన్ తన షార్ట్‌పిచ్ బంతుల అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉంది. నీల్ వాగ్నర్ బ్యాట్స్‌మెన్ రిబ్స్ లక్ష్యంగా బంతులేసి ఇబ్బందిపెట్టడంలో సిద్ధహస్తుడు. దూకుడుతో బౌలర్లను భయపెట్టే పంత్‌కు వాగ్నర్‌కు మధ్య ఆసక్తికర పోరు సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కివీస్ ఓపెనర్ డేవిడ్ కాన్వే తనదైన రోజున భారీ ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉన్నవాడు. కివీస్ సారథి కేన్స్ విలయమ్సన్.. కవర్ డ్రైవ్‌లతో మైదానంలో పరుగుల వరద పారించగలడు. రాస్ టేలర్ లాంటి సీనియర్ ఆటగాడు, సౌథీ, బౌల్ట్ లాంటి పేస్ బలగం కూడా న్యూజిలాండ్‌కు అదనపు బలమే.