ప్రస్తుతం ఒప్పందంలో రూ.130 కోట్ల డిస్కౌంట్ ఇవ్వాలని స్వదేశీ సీజన్ మీడియా హక్కుల హక్కుదారు స్టార్ ఇండియా.. బీసీసీఐని అభ్యర్థించింది. మరోవైపు స్పాన్సర్‌గా వైదొలగాలనుకుంటున్న బైజూస్ బ్యాంక్ గ్యారెంటీని సొమ్ము చేసుకోవాలని కోరింది. ఈ రెండు అంశాలపై సోమవారం వర్చువల్‌గా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు.
'రూ.130 కోట్లు డిస్కౌంట్ ఇవ్వండి ప్లీజ్'.. BCCIకి స్టార్ సంస్థ విజ్ఞప్తి! - స్టార్ స్పోర్ట్స్ లేటెస్ట్ అప్డేట్స్
తమకు డిస్కౌంట్ ఇవ్వాలని క్రికెట్ ప్రసార స్వదేశీ సీజన్ మీడియా హక్కుల హక్కుదారు స్టార్ ఇండియా బీసీసీఐని కోరింది. ఈ విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు.
"బైజుస్, స్టార్ ఇండియా అంశాలను మాత్రమే సమావేశంలో చర్చించారు. కోట్ల డబ్బుతో ముడిపడిన సీరియస్ అంశమిది. నిర్ణయానికి సమయం పడుతుంది" అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. 2018-2023 కాలానికి బీసీసీఐకి స్టార్ రూ.6138.1 కోట్లు చెల్లించింది. ఇందులోనే ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతోంది. కరోనా కారణంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్న కొన్ని మ్యాచ్‌లను రిషెడ్యూలు చేయాల్సివచ్చింది. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి స్టార్ ఇండియా నిరాకరించింది. అయితే స్టార్ ఎలాంటి డిస్కౌంట్ కోరలేదని పరిశమ్ర వర్గాలు తెలిపాయి.
"2020లో ఆడాల్సిన మ్యాచ్‌లను 2022కు వాయిదా వేశారు. ఆ మ్యాచ్‌లకు 2020 ధరలనే తీసుకోవాలని కోరింది. కాబట్టి ‘స్టార్ ఇండియా’ డిస్కౌంట్ కోరిందనడం తప్పుదోవ పట్టించడమే" అని చెప్పాయి. ఇక జెర్సీ స్పాన్సర్‌గా వైదొలగాలనుకుంటున్నట్లు బైజూస్ గత నవంబరులోనే బోర్డుకు తెలిపింది. కానీ 2023 మార్చి వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. ఒప్పందాన్ని బైజూస్ గత జూన్‌లోనే 2023 వరకు పొడిగించింది. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలగాలనుకుంటున్న ఆ సంస్థ.. రూ.140 కోట్ల బ్యాంకు గ్యారెంటీని సొమ్ము చేసుకోవాలని కోరింది. మరో రూ.160 కోట్లను వాయిదా పద్ధతిలో చెల్లించనుంది.