ప్రస్తుతం టీమ్ఇండియాలో ఎవరు అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నారంటే.. ప్రతి క్రీడాభిమానికి టక్కున గుర్తొచ్చే పేరు అతడిదే. జట్టుకు ఎంపికైనప్పటి నుంచి అదిరిపోయే షాట్లు బాదుతూ.. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. అతడు క్రీజులో ఉంటే.. బంతులు వేయడానికి బౌలర్లు చుక్కలే అనడంలో ఎలాంటి అతిశయయోక్తి లేదు. ఈ ప్రపంచకప్‌లో అతడు విశ్వరూపాన్ని క్రికెట్ ప్రపంచం చూస్తోంది. బంతి ఎలాంటిదన్నది చూడకుండా.. మైదానం నలుమూలలా తన మార్కు వినూత్న షాట్లతో పరుగులు సాధిస్తున్నాడు. అతడు మరెవరో కాదు పైన ఫొటోలు ఉన్న చిన్నవాడే. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగాలిగారా? అతడే సూర్యకుమార్ యాదవ్.
ప్రస్తుతం క్రికెట్లో ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు దూరమయ్యాడని అభిమానులేమీ బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే అతడి లాగే 360 డిగ్రీల కోణంలో ఆడుతూ.. ఈ తరం క్రికెట్ అభిమానులకు అంతకుమించిన వినోదాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఎన్నోసార్లు తన సత్తాను చాటిచెప్పిన సూర్య.. అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా అవకాశం అందుకున్నప్పటికీ పతాక స్థాయి విధ్వంసంతో దూసుకెళ్తున్నాడు.
తాజా ప్రపంచకప్‌లోనూ తన బ్యాటింగ్ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇక నిన్న జింబాబ్వేపై జరిగిన సూపర్ 12 చివరి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్ అద్భుతం. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో వీరవిహారం చేస్తూ కేవలం 25 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు.