తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక స్పిన్నర్​ నయా రికార్డ్.. 71 ఏళ్ల చరిత్రను..

టెస్టు క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్​ జయసూర్య ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్‌ ఇన్నింగ్స్‌తో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Prabath Jayasuriya
Prabath Jayasuriya

By

Published : Apr 28, 2023, 2:49 PM IST

శ్రీలంక టాప్​ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య.. టెస్టు క్రికెట్​లో ఓ నయా రికార్డును సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రెండో బౌలర్​గా చరిత్రకెక్కాడు. ఐర్లాండ్​తో గాలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో ఈ రికార్డు నమోదు చేశాడు. దీన్ని అతను 7 టెస్టు మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం. అంతకుమందు ఈ రికార్డు వెస్టిండీస్‌ మాజీ స్పిన్నర్‌ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది.

ఆల్ఫ్ వాలెంటైన్.. తన ఎనిమిదో టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఆయన ఆ రికార్డును 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. దీంతో 71 ఏళ్ల తర్వాత తాజాగా.. ఆ ప్రపంచ రికార్డును ఈ లెఫ్టామ్ స్పిన్నర్ బద్దలుకొట్టాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా ప్రభాత్​ రికార్డులకెక్కాడు.

అయితే ఇప్పటికీ మొదటి స్థానంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ ఉన్నాడు. అతడు 1988లో ఇంగ్లండ్​తో జరిగిన తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లండ్ బౌలర్ థామస్ రిచర్డ్‌సన్ (1896), సౌతాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ (2012) కూడా తమ ఏడో టెస్టులోనే 50 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. అయితే వీళ్లిద్దరూ పేస్ బౌలర్లు.

ఇక తాజాగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు ఆట లంచ్ బ్రేక్​ సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 5వికెట్లకు 121 పరుగులను స్కోర్​ చేసింది. అంతకుముందు ఐర్లాండ్.. తన తొలి ఇన్నింగ్స్​లో 492 పరుగులకు ఆలౌటైంది. పాల్ స్టిర్లింగ్ సెంచరీతో చెలరేగాడు. ఇక టక్కర్, ఆండీ బాల్ బిర్నీ, కూడా శతకానికి చేరువుగా ఉన్నారు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్​ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నిశాన్ మదుశంక, కుశాల్ మెండీస్ డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శనను కనబరిచారు. ఇక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, మ్యాథ్యూస్ కూడా సెంచరీలతో చెలరేగారు. అలా శ్రీలంక 212 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.

ఇక 212 పరుగులు వెనుకబడి బ్యాటింగ్​కు దిగిన ఐర్లాండ్ జట్టు ప్రస్తుతం డ్రా కోసం పోరాడుతుంది. ఆటకు శుక్రవారం మ్యాచ్​ చివరి రోజు కావడం వల్ల ఇది దాదాపుగా డ్రాగా ముగిసే అవకాశం ఉంది. టీ బ్రేక్​లోపు ఐర్లాండ్​ను ఆలౌట్ చేస్తే.. శ్రీలంక ఈ మ్యాచ్​లో గెలిచే అవకాశాలున్నాయి. ఇక తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details