Srilanka Won Asia Cup 2022: శ్రీలంక అదరహో. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి ఏమాత్రం పోటీలో లేనట్లు కనిపించిన ఆ జట్టు.. ఆ తర్వాత ఒక్కటీ ఓడలేదు. అదిరే ప్రదర్శనతో ఇప్పుడు సగర్వంగా కప్పును ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. భానుక రాజపక్స (71 నాటౌట్; 45 బంతుల్లో 6×4, 3×6) పోరాటంతో మొదట శ్రీలంక 6 వికెట్లకు 170 పరుగులు సాధించింది. రవూఫ్ (3/29) విజృంభించాడు. లంక ఓ దశలో 58కే అయిదు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడగా.. రాజపక్స గొప్పగా బ్యాటింగ్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హసరంగ డిసిల్వా (36; 21 బంతుల్లో 5×4, 1×6)తో కలసి జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు.
ఛేదనలో పాకిస్థాన్ తడబడింది. ప్రమోద్ మదుషాన్ (4/34), హసరంగ డిసిల్వా (3/27) విజృంభించడంతో 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది.. రిజ్వాన్ (55; 49 బంతుల్లో 4×4, 1×6) టాప్ స్కోరర్. ఛేదనలో నాలుగో ఓవర్లోనే బాబర్ అజామ్ (5), ఫకార్ జమాన్ (0)లను ఔట్ చేయడం ద్వారా పాక్‌కు మదుషాన్ పాకిస్థాన్‌కు షాకిచ్చాడు. రిజ్వాన్‌తో పాటు ఇఫ్తికార్ (32) రాణించడంతో పాక్ 13 ఓవర్లలో 91/2తో నిలిచింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగినా ఆ జట్టు పోటీలోనే ఉంది. కానీ ఇఫ్తికార్‌ను ఔట్ చేయడం ద్వారా మూడో వికెట్ భాగస్వామ్యాన్ని మదుషాన్ విడదీయడంతో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బతగింది. అక్కడి నుంచి ఆ జట్టు చకచకా వికెట్లు కోల్పోయింది. కొన్ని ఓవర్ల ముందే పాక్ ఓటమి ఖాయమైపోయింది. లంక ఫీల్డింగ్ కూడా బాగుంది. ఆ జట్టు ఫీల్డర్లు చక్కని క్యాచ్‌లు అందుకున్నారు.
రాజపక్స అదుర్స్..
170/6.. శ్రీలంకకిది ఏమాత్రం ఊహించని స్కోరే. ఆ జట్టు ఆరంభం చూస్తే.. కనీసం పోటీ ఇవ్వడం కూడా కష్టమే అనిపించింది. కానీ భానుక రాజపక్స అదిరే స్ట్రోక్ ప్లేతో లంక మంచి స్కోరును అందుకుంది. శ్రీలంక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. నసీమ్ షా, రవూఫ్ తమ పదునైన పేస్‌తో ఆ జట్టును బెంబేలెత్తించారు. మూడో బంతికే కుశాల్ (0)ను బౌల్డ్ చేయడం ద్వారా నసీమ్ లంక పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత రవూఫ్ విజృంభించాడు. నాలుగో ఓవర్లో నిశాంక (8)ను ఔట్ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో గుణతిలక (1)ను వెనక్కి పంపాడు. లంక పతనం వేగంగా సాగింది. ధనంజయ డిసిల్వా (28)ను ఇఫ్తికార్, శానక (2)ను 9వ ఓవర్లో షాదాబ్ ఔట్ చేయడంతో ఆ జట్టు 58/5తో పీకల్లోతు కష్టాలోకి కూరుకుపోయింది. ఆ దశలో ఫైనల్ ఏకపక్షమౌతుందేమో అనిపించింది. కానీ రాజపక్స అద్భుత బ్యాటింగ్‌తో లంకను గట్టెక్కించాడు. హసరంగ డిసిల్వాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన రాజపక్స.. చక్కని షాట్లతో అలరించాడు. హసరంగతో ఆరో వికెట్‌కు 58, కరుణరత్నె (14 నాటౌట్)తో అభేద్యమైన ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో శ్రీలంక 50 పరుగులు రాబట్టింది.