టీమ్ఇండియాతో సిరీస్ కోసం ఎట్టకేలకు స్క్వాడ్‌ను ప్రకటించింది శ్రీలంక బోర్డు(IND vs SL). 23 మందితో కూడిన జట్టును దసున్ శనక(Dasun Shanaka) సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక క్రీడల మంత్రి నమల్ రాజపక్సా నుంచి అధికారిక అనుమతి వచ్చాకే.. జట్టును ప్రకటించింది లంక బోర్డు.
ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ పెరీరా.. మోకాలి గాయంతో దూరం కాగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ బినురా ఫెర్నాండో చీలమండ గాయంతో తప్పుకున్నాడు.
బోర్డుతో సీనియర్ క్రికెటర్లకు వేతనాల విషయంలో వివాదమున్నప్పటికీ.. వారిని స్క్వాడ్‌లో చేర్చింది లంక బోర్డు. అయితే ఏంజెలో మాథ్యూస్ మాత్రం.. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.
ఇంగ్లాండ్ పర్యటన అనంతరం బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో తొలుత సిరీస్ జరగడం అనుమానంగా మారింది. కానీ చివరికి జులై 13న మొదలవ్వాల్సిన సిరీస్.. జులై 18 నుంచి ప్రారంభంకానుంది. వన్డేలతో మొదలు కానున్న పర్యటన టీ20లతో ముగుస్తుంది. జులై 18, 20, 23న వన్డేలు.. 25, 27, 29న టీ20లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లన్నింటికి కొలోంబోలోని ఆర్ ప్రేమదాస స్డేడియం వేదిక కానుంది.
శ్రీలంక స్క్వాడ్..
దసున్ శనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), అవిశ్క ఫెర్నాండో, భానుక రాజపక్సా, పాథుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, వనిందు హసరంగ, అశేన్ బండారా, మినోద్ భానుక, లాహిరు ఉదర, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుశ్మంత చమీరా, లక్షన్ సందకన్, అఖిల ధనంజయ, శిరన్ ఫెర్నాండో, ధనంజయ లక్షన్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమే, అశిత్ ఫెర్నాండో, కసున్ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదన.
ఇదీ చదవండి:'వీళ్లు క్రికెటర్లా.. లేక రెజ్లర్లా?'