శ్రీలంక క్రికెట్ బోర్డుకు కాసుల పంట పండింది. 2022 సంవత్సరానికి గాను ఆ దేశ క్రికెట్ బోర్డు.. రికార్డు స్థాయిలో నికర లాభాన్ని ఆర్జించింది. రూ.630 కోట్ల భారీ లాభాన్ని అందుకుంది. ఆ దేశ క్రీడా సంఘం చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక నికర లాభంగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. "2022లో రూ.630 కోట్ల లాభం సమాకూరింది. అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్, స్పాన్సర్ షిప్ కాంట్రాక్టులు, ఐసీసీ వార్షిక సభ్యుల చెల్లింపుల ద్వారా ఆ భారీ లాభాన్ని అందుకున్నాం" అని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
సంక్షోభంలోనూ మ్యాచ్లు..తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ దేశంలో క్రికెట్ మ్యాచులు నిర్వహించింది. స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20, వన్డే, టెస్ట్ మ్యాచులు ఆడింది లంక. ఆయా మ్యాచులకు క్రికెట్ అభిమానులు విపరీతంగా తరలివచ్చారు. తమ దేశానికి వచ్చి ఆడుతున్నందుకు ఆసీస్ క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బ్యానర్ల రూపంలో ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీగా ఆదాయం సమకూరింది.