Sreesanth Vs Gambhir LLC Legal Notice : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్‌కు షాక్ తగిలింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్- ఎల్ఎల్సీ కమిషనర్ అతడికి లీగల్ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్, టోర్నమెంట్లో ఆడుతూ తన కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్‌పై ఆపోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను ఎల్ఎల్సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్ చేస్తేనే అతడితో తదుపరి చర్చలు జరుపుతామని తెలిపింది. అటు అంపైర్లు కూడా ఈ గొడవపై తమ రిపోర్ట్‌ను ఎల్ఎల్సీ యాజమాన్యానికి సమర్పించారు. అయితే అందులో శ్రీశాంత్‌ను గౌతమ్ గంభీర్ ఫిక్సర్ అన్నాడన్న విషయం ఎక్కడా పేర్కొనలేదు.
అసలు ఏం జరిగిందంటే?
ఎల్ఎల్సీలో భాగంగా ఇటీవల ఇండియన్ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇండియా క్యాపిటల్స్ జట్టుకు గంభీర్ కెప్టెన్ కాగా, శ్రీశాంత్ గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ రెండో ఓవర్లో శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్, వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి ఊపుమీదున్నాడు. ఈ క్రమంలో శ్రీశాంత్, గంభీర్ వైపు తీక్షణంగా చూశాడు. దీంతో గంభీర్ ఏ మాత్రం తగ్గకుండా ఏంటి అన్నట్లుగా శ్రీశాంత్‌ను చూశాడు. దీంతో మైదానంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతలో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకొని ఇద్దరికి నచ్చజెప్పారు.
మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో "మైదానంలో గంభీర్ నన్ను 'ఫిక్సర్, ఫిక్సర్' అని అన్నాడు. నేను నవ్వుతూ ఏమన్నావ్? అని అడిగా అంతే. మళ్లీ తను అలాగే అన్నాడు. మధ్యలో వచ్చిన అంపైర్లతో కూడా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. నేను అతడిని ఒక్క మాట అనలేదు. చెడుగా ప్రవర్తించలేదు. అయితే అతడు 'సిక్సర్' అని అంటే నేను 'ఫిక్సర్' అని ప్రచారం చేస్తున్నానంటూ, అతడి మద్దతుదారులు అతడ్ని కాపాడాలని చూస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ప్రజలు నిజాన్ని గమణించాలి" అని శ్రీశాంత్ అన్నాడు. ఇక గంభీర్‌ను తాను రెచ్చగొట్టకపోయినా, అతడే తనతో గొడవ పడ్డాడని, అతడు సీనియర్లకూ మర్యాద ఇవ్వడని చెప్పాడు.