యూకేలో దుండుగుల చేతిలో తీవ్రంగా గాయపడిన సౌతాఫ్రికా యువ క్రికెటర్ మొండ్లీ ఖుమాలో (Mondli Khumalo) కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ వెల్లడించాడు. ఖుమాలో యూకేలోని కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. గత ఆదివారం (మే 29)న తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించడానికి అతడికి మూడు శస్త్ర చికిత్సలు చేశారు. ‘మొండ్లీ ఖుమాలో శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి గురించి అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడి ఆరోగ్యంలో చాలా పురోగతి కనిపించింది’ అని లాయిడ్ ఐరిష్ వెల్లడించాడు.