SA vs IND Test: దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతున్న టీమ్ఇండియా టెస్టు జట్టుపై ఆందోళన వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. కీలక ఆటగాళ్లందరూ గాయాల కారణంగా టెస్టు సిరీస్కు దూరమవుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రాక్టీస్ సెషన్లో గాయమైంది. దీంతో టెస్టు సిరీస్కు దూరమవుతున్నట్లు బీసీసీఐకి తెలిపాడు. ఇప్పటికే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగానే జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనను బీసీసీఐ రద్దు చేస్తే బాగుంటుందని అకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేరు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఉండడని చెబుతున్నారు. అసలేం జరుగుతోంది? భారత జట్టు ఈ పర్యటనను రద్దు చేయాలా?."
--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.
జట్టులో రోహిత్ శర్మ లేకపోవడం పెద్దలోటు అని ఆకాశ్ చోప్రా అన్నాడు. అతడు లేకపోతే సిరీస్ గెలిచే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయని అభిప్రాయపడ్డాడు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగినా.. మూడో ఓపెనర్ ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారిందని అన్నాడు. ఈ లెక్కలో చూస్తే.. టీమ్ఇండియా టెస్టు జట్టు బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నాడు.