Legends league cricket 2022: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి మైదానంలోకి దిగుతున్నాడా..? 2012లో భారత టీ20 లీగ్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటి వరకు బ్యాట్ పట్టిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పాలనాపరమైన బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చాడు. అయితే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) గత సీజన్‌లోనే గంగూలీ ఆడతాడని భావించినా.. అది కుదరలేదు. రెండో ఎడిషన్‌లోనూ పాల్గొనడం లేదని ఈ మధ్యే గంగూలీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సౌరభ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టును బట్టి చాన్నాళ్లకు క్రికెట్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎల్‌ఎల్‌సీ సీజన్ భారత్‌లోనే జరగనుంది. ఈ క్రమంలో ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు గంగూలీ సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోను మాజీ సారథి ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
దాదా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న డాషింగ్ క్రికెటర్!
Legends league cricket 2022: టీమ్‌ఇండియా కెప్టెన్‌గా, ఆటగాడిగా సౌరభ్ గంగూలీ ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించి ఆడి అభిమానులకు మర్చిపోలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్‌గా బిజీగా ఉన్న దాదా మరోసారి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గంగూలీ మరోసారి బ్యాట్స్‌మెన్‌గా అభిమానులను అలరించనున్నాడు.
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫండ్ రైజింగ్ కోసం ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండటం బాగుంది. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నా. దిగ్గజాలు ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగం కాబోతున్నా. త్వరలోనే క్రికెట్ బంతిని ఎదుర్కోబోతున్నా" అని గంగూలీ పోస్టు పెట్టాడు. దాదా ఆడటంపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా అధికారికంగా వెల్లడించారు. "దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీకి ధన్యవాదాలు. ఇతర లెజెండ్స్‌తో ఆడేందుకు ముందుకు వచ్చిన దాదాకు కృతజ్ఞతలు. ప్రత్యేక కారణం కోసం గంగూలీ మ్యాచ్ ఆడబోతున్నారు. గంగూలీకే సాధ్యమైన కొన్ని షాట్లను చూసే అవకాశం ప్రేక్షకులు, అభిమానులకు దక్కనుంది" అని రహేజా వెల్లడించారు.
ఇదీ చూడండి:రికార్డుల వేటలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. జట్టులోకి సంజూ శాంసన్