తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ విషయంపై గంగూలీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలి' - మదన్​లాల్ వ్యాఖ్యలు

టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విరాట్​ కోహ్లీ వ్యాఖ్యల అనంతరం దీనిపై చర్చ మరింత తీవ్రమైంది. దీనిపై మాజీ క్రికెటర్ మదన్​లాల్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ అంశంపై వస్తున్న పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే గంగూలీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

ganguly
గంగూలీ

By

Published : Dec 18, 2021, 9:50 PM IST

వన్డే కెప్టెన్సీ విషయంలో టీమ్ఇండియా టెస్ట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య విభేదాలు వచ్చినట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోరానని, అందుకు అతడు అంగీకరించలేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నాడు. విరాట్ మాత్రం దీన్ని ఖండించాడు. తాను టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెప్పినప్పుడు, అలా చేయొద్దని ఎవరూ తనను కోరలేదని విరాట్ స్పష్టం చేశాడు. విలేకరుల సమావేశంలో కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని గంగూలీపై ఒత్తిడి పెరుగుతోంది. భారత మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌ కూడా ఈ విషయంపై స్పందించాడు. బీసీసీఐ, కోహ్లీ మధ్య ఉన్న విభేదాలు వివాదాస్పదమైనవి కావని, అభిప్రాయానికి సంబంధించినవి అని అన్నాడు. ఈ అంశంపై వస్తున్న పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే గంగూలీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని మదన్‌ లాల్‌ అభిప్రాయపడ్డారు.

"ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మెరుగైన ఆలోచన చేయాలని భావిస్తున్నా. ఎందుకంటే ఇది వివాదం కాదు, అభిప్రాయానికి సంబంధించినది. సౌరభ్ గంగూలీ.. విరాట్‌తో ఏమి చెప్పాడో నాకు తెలియదు. కాబట్టి నేను దానిపై మాట్లాడలేను. కానీ, ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని భావిస్తున్నా. అది మొత్తం సమస్యకు ముగింపు పలుకుతుంది. ఇప్పుడు మనకు దక్షిణాఫ్రికా పర్యటన ముఖ్యం. కాబట్టి, ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టాలి"

--మదన్ లాల్, మాజీ క్రికెటర్.

యాజమాన్యంతో ఉన్న సమస్యను కోహ్లీ పరిష్కరించుకోవాలని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ చెప్పినదానితో తాను ఏకీభవిస్తున్నానని మదన్ లాల్ పేర్కొన్నారు. 'గవాస్కర్ చెప్పింది కరెక్టే. విరాట్ తన సమస్యలన్నింటినీ మేనేజ్‌మెంట్‌తో పరిష్కరించుకోవాలి. ఇది పెద్ద విషయం కాదు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా సెలక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే వివాదాలు తలెత్తవు' అని భారత మాజీ క్రికెటర్‌ వివరించారు.

ఇదీ చదవండి:

Ashwin IPL: 'వచ్చే ఐపీఎల్​లో ఆ జట్టులోనే ఆడాలనుంది'

Ashes 2021: డే/నైట్ టెస్టులో స్టార్క్ సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details