Teamindia Ganguly: టీమ్‌ఇండియాకు ఏడు సిరీస్‌ల్లో ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లు వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే అంత మంది ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాల్సివచ్చిందని చెప్పాడు. "ఇంత తక్కువ సమయంలో జట్టుకు అంత మంది కెప్టెన్లుగా పని చేయడం ఆదర్శప్రాయం కాదని అంగీకరిస్తా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగింది. దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ నాయకత్వం వహించాల్సింది. కానీ దాని కన్నా ముందే అతడు గాయపడ్డాడు. దాంతో అక్కడ వన్డేల్లో రాహుల్ నాయకత్వం వహించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై సిరీస్ ఆరంభానికి ఒక రోజు ముందు రాహుల్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో సన్నాహక మ్యాచ్ ఆడుతుండగా రోహిత్‌కు కరోనా సోకింది. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పు పట్టలేం. తీరికలేని క్యాలెండర్‌లో ఆటగ్లాకు విరామమివ్వక తప్పదు. గాయాలు కూడా అయ్యాయి. ఆటగాళ్లపై పనిభారం పెరగకుండా కూడా చూడాలి. ప్రతి సిరీస్‌కు ప్రధాన కోచ్ (ద్రవిడ్) పరిస్థితి చూస్తే బాధనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్లతో ఆడాల్సివచ్చింది" అని గంగూలీ అన్నాడు. ఇటీవల కాలంలో కోహ్లి, రోహిత్, రాహుల్, పంత్, హార్దిక్, బుమ్రా, ధావన్ వివిధ ఫార్మాట్లలో భారత జట్లను నడిపించారు.
భారత టీ20 లీగ్‌లో ఇప్పుడు పది జట్లు ఉన్నాయి. భవిష్యత్‌లో బీసీసీఐ ఆదాయం రూ.60 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్ల సంఖ్య కూడా పెరిగేకొద్దీ ప్రతిభావంతులైన క్రికెటర్లు విషయంలో రాజీ పడవచ్చని మీరు భయపడుతున్నారా?
గంగూలీ:అలా ఏం ఉండదు. సమయం గడిచేకొద్దీ భారత్‌లో ప్రతిభావంతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. మన దేశంలో ఎంత మంది ప్రతిభావంతులు ఉన్నారో ఈ టీ20 లీగ్ నిరూపిస్తోంది. ఇప్పుడున్న టీమ్‌ఇండియాను చూడండి. అటు టెస్టు క్రికెట్‌లో ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నారో చూడండి.