Sourav Ganguly Security : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీకి భద్రత పెంచాలని బంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాకు ప్రస్తుతం ఉన్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో.. మమత సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దాదాకు 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
'వై' కేటగిరీ భద్రత ప్రకారం.. గంగూలీ ఇంటి దగ్గర ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ అధికారులు ఉండేవారు. ఇప్పుడు 'జెడ్' కేటగిరీ భద్రత ప్రకారం.. ఇకపై దాదా భద్రత సిబ్బంది సంఖ్య ఎనిమిది నుంచి పది మంది పోలీసులు 24 గంటల పాటు ఉంటారు. ఈ మేరకు మంగళవారం.. రాష్ట్ర ఉన్నతాధికారులు బెహలాలోని గంగూలీ కార్యాలయానికి చేరుకొని స్థానిక పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
కాగా ప్రస్తుతం బంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీమ్, మోలోయ్కు జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. తాజాగా గంగూలీకి కూడా జెడ్ ప్లస్ భద్రత అందించింది రాష్ట్ర ప్రభుత్వం. "గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్లో తన జట్టు దిల్లీ క్యాపిటల్స్‌తో బిజీగా గడుపుతున్నాడు. మే 21న కోల్‌కతాకు తిరిగి వస్తాడు. ఆ రోజు నుంచి గంగూలీకు జెడ్ కేటగిరీ భద్రతను అందిస్తాము" అని పోలీసు అధికారి తెలిపారు.