భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ పదవిలో మరింత కాలం కొనసాగేందుకు ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తి చూపిస్తున్నారట. ఈ క్రమంలోనే టీ20 లీగ్ ఛైర్మన్ పదవిని ఆయన తిరస్కరించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతవారం దాదా దిల్లీలోని అనేకమంది పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే రెండోసారి బీసీసీఐ పగ్గాలు గంగూలీకి అప్పగించేందుకు వారు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. "గంగూలీకి టీ20 లీగ్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేశాం. అయితే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉన్న తాను ఇప్పుడు అదే సంస్థలోని ఓ సబ్ కమిటీకి నాయకత్వం వహించలేనని దాదా చెప్పారు. ప్రస్తుతమున్న పదవిలోనే కొనసాగేందుకు ఆయన ఆసక్తి చూపించారు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లీగ్ క్రికెట్ ఛైర్మన్ పదవిని గంగూలీ నిరాకరించడంతో ఆ బాధ్యతలను అరుణ్ ధుమాల్‌కు అప్పగించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.