పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో(Ganguly conflict of interest) మరోసారి చిక్కుకున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.
ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్ అధినేత సంజీవ్ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కడంలో గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లోని సంజీవ్ గోయంకా ఛైర్మన్‌గా ఉన్న ఏటీకే-మోహన్ బగన్ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాది జూన్‌లో ఏటీకే క్లబ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగా గంగూలీ ఎంపికయ్యాడు. ఇందులో ఉత్సవ్ పరేఖ్, శ్రిన్జోయ్ బోస్, దెబాశిష్ దత్తా, గౌతమ్ రేయ్, సంజీవ్ మెహ్రా సభ్యులుగా ఉన్నారు.
గంగూలీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఓ బీసీసీఐ సీనియర్ అధికారి.. "ఇది వివాదాస్పద అంశమని స్పష్టంగా తెలుస్తోంది. గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడని అర్థం చేసుకోవాలి. అతను ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు" అని పేర్కొన్నాడు.