ఐసీసీ(ICC) ప్రారంభ ఎడిషన్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship)పై స్పందించాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly). ఈ రెండేళ్ల కాలంలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని.. జట్టు తరఫున పలువురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారని దాదా మెచ్చుకున్నాడు.
డబ్ల్యూటీసీ తొలి విడతలో కోహ్లీసేన వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విజయవంతంగా సిరీస్‌లను గెలుచుకుంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 71 వికెట్లతో టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో భారత్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె మన జట్టు తరఫున అగ్రస్థానం సాధించాడు. వీరిద్దరూ తమ అంచనాలను అందుకున్నారని గంగూలీ ప్రశంసించాడు.
"ఈ రెండేళ్ల డబ్ల్యూటీసీ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగమయ్యారు. తొలి ఎడిషన్‌లో రహానె ఎక్కువ పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఇషాంత్, షమి మంచి ప్రదర్శన చేశారు. కపిల్ దేవ్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో 100 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్‌గా ఇషాంత్ రికార్డు సృష్టించాడు. రోహిత్‌తో పాటు రహానె, విరాట్ అద్భుతంగా ఆడారు."