జట్టు ఎంపిక సమావేశాల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలతో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగేవని.. కొన్నిసార్లు ఒకరి ముఖం మరొకరం చూసుకునేవాళ్లం కాదని టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేసిన ఘనత తమదేనని అన్నాడు.
'కోహ్లీ, శాస్త్రి, నేను ముఖాలు చూసుకునేవాళ్లం కాదు' - ఎమ్మెస్కే ప్రసాద్
జట్టు ఎంపికలో సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలతో తీవ్ర వాదోపవాదాలు జరిగేవని తెలిపారు సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. కొన్నిసార్లు ఒకరి ముఖం మరొకరి చూసుకునేవాళ్లం కాదని వెల్లడించారు.
"అందరం ప్రొఫెషనల్ క్రీడాకారులమే. జట్టుకు ఏది మంచో అర్థం చేసుకోగలం. కొన్నిసార్లు ఒకరి ముఖం మరొకరం చూసుకునేవాళ్లం కాదు. అంతలా వాదోపవాదాలు జరిగేవి. మరుసటి రోజు ఉదయం కలుసుకున్నప్పుడు మా నిర్ణయం సరైనది గుర్తించేవారు. సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో జరిగే వాడి వేడి చర్చల గురించి విరాట్, రవిశాస్త్రి కూడా చెప్తారు. బహిరంగంగా మా మధ్యలో విభేదాలు లేనంత మాత్రాన మేం వారికి లొంగిపోయినట్లు కాదు. ఎన్నో విషయాలపై వారిని ఎలా ఒప్పించామో ఎవరికి తెలుసు. రిషబ్ పంత్‌ను ఎంపిక చేసినప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. టెస్టు క్రికెట్లో పంత్ బ్యాటింగ్ చేయలేడని.. కఠినమైన వికెట్లపై కీపింగ్ చేయలేడని అన్నారు. కానీ సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతనెలా కీపింగ్ చేశాడో అందరం చూశాం. పంత్ బాగా ఆడతాడంటే చాలామంది నమ్మలేదు" అని ప్రసాద్ వివరించాడు.