సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దిల్లీ వేదికగా కర్ణాటకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో.. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సిక్స్ బాది జట్టుకు టైటిల్‌ను అందించాడు బ్యాట్స్‌మన్ షారుక్ ఖాన్(33*). ఈ విజయంతో టోర్నీ చరిత్రలో మూడో సారి కప్‌ను అందుకుంది తమిళనాడు. అంతకుముందు 2006-07, 2020-21 సీజన్లోనూ కప్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తమిళనాడుకు శుభారంభం దక్కలేదు. హరి నిశాంత్(23) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ ఎన్ జగదీశన్(41) ఒక్కడే స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. సాయి సుదర్శన్(9), కెప్టెన్ విజయ్ శంకర్(18), సంజయ్ యాదవ్(5), ఎం.మహ్మద్(5) విఫలమయ్యారు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో షారుక్ ఖాన్ అదరగొట్టాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. కర్ణాటక బౌలర్లలో కరియప్పా 2, ప్రతీక్ జైన్, విద్యాధర్ పాటిల్, కరుణ్ నాయర్ చెరో వికెట్ తీశారు.