ఫాస్ట్బౌలింగ్ నైపుణ్యాలు.. ముఖ్యంగా వైవిధ్యం పరంగా చూస్తే బుమ్రా కంటే మహమ్మద్ సిరాజే ముందుంటాడని టీమ్ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ ఐపీఎల్లో బెంగళూరు తరపున ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసిన సిరాజ్.. పరుగుల కట్టడిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
"రెండేళ్ల క్రితం భారత్-ఎ తరపున ఎర్రబంతితో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అయిదారు వికెట్లు పడగొడుతున్నాడని సిరాజ్ గురించి చర్చ సాగింది. ఇప్పుడతను అన్ని ఫార్మాట్లలో మంచి బౌలర్గా ఎదుగుతున్నాడు. అతనిలో నైపుణ్యాలకు కొదవలేదు. బౌలింగ్లో అన్ని రకాల వైవిధ్యాలు ప్రదర్శిస్తున్నాడు. నిజానికి నైపుణ్యాల గురించి మాట్లాడితే.. వైవిధ్యం పరంగా చూస్తే బుమ్రా కంటే అతనే ముందుంటాడు. స్లో డెలివరీలు తెలివిగా వేయగలడు. వేగాన్ని కొనసాగించగలడు. కొత్త బంతిని కదిలించగలడు. అతనిప్పుడు ఫిట్నెస్పై దృష్టిపెట్టడం సహా మెదడును చురుగ్గా ఉంచుకోవాలి. ఈ రెండు విషయాలను సమర్థంగా చేస్తే అతనికిక ఆకాశమే హద్దు."