Siraj Asia Cup 2023 :ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగిపోయాడు టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు.. మరో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా విజయం సాధించింది. అయితే ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు సిరాజ్. ఇదంతా ఓ కలలా ఉందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదని అన్నాడు.
"ఇదంతా కలలా అనిపిస్తోంది. గతంలో తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభంలోనే నాలుగు వికెట్లు తీశాను. కానీ ఐదు వికెట్ల ఘనతను అందుకోలేకపోయాను. ఈ రోజు నేను పెద్దగా కష్టపడలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఎప్పుడూ నేను స్వింగ్ బాల్స్ సంధిస్తాను. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల్లో పెద్దగా స్వింగ్ దొరకలేదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం బంతి అద్భుతంగా స్వింగ్ అయింది. కానీ నేను ఔట్ స్వింగర్లతోనే వికెట్లు తీశాను. బ్యాటర్లతో డ్రైవ్ షాట్ ఆడేలా చేసి వికెట్లు తీశాను పడగొట్టాను." అని సిరాజ్ పేర్కొన్నాడు.
కాగా, సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి.. ఆ ఘనత అందుకున్న ఫస్ట్ భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ ఓవర్ వేశాడు. ఒక్కో బంతిని ఒక్కోలా సంధించి.. బ్యాటర్లను సిరాజ్ బోల్తా కొట్టించాడు. ఫస్ట్, థర్డ్, ఫోర్త్, సిక్త్ బాల్స్‌కు వికెట్లను తీశాడు. మొత్తంగా నిప్పులు చెరిగి నాలుగు వికెట్ల వీరుడిగా నిలిచాడు.