Siraj 6 Wickets :2023 ఆసియా కప్ టైటిల్ భారత్వశమైంది. ఫైనల్స్‌లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ఎనిమిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే భారత్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ సిరాజ్. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుపై ఆరంభం నుంచే నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను మెయిడెన్‌గా మలిచిన సిరాజ్.. నాలుగో ఓవర్లో 4 వికెట్లతో చెలరేగాడు. దీంతో లంక 4 ఓవర్లు ముగిసేసరికే సగం వికెట్లు కోల్పోయింది.
తర్వాత ఆరో ఓవర్లో కెప్టెన్ రోహిత్ మళ్లీ సిరాజ్‌కు బంతినిచ్చాడు. ఈ ఓవర్లో కూడా సిరాజ్.. షనక (0)ను పెవిలియన్ పంపాడు. సిరాజ్ ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ క్రమంలో అతడు కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. సిరాజ్ కెరీర్ బెస్ట్ స్పెల్‌పై పలువురు మాజీలు, ప్రముఖులు ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
"ఇందంతా నమ్మలేకపోతున్నాను. గతంలో నేను తిరువనంతపురంలో ఆడిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశా. ఇక అప్పటి నుంచి 5 వికెట్ల ఘనతను అందుకోలేకపోయా. ఇక ఈ మ్యాచ్‌లో నేను పెద్దగా కష్టపడలేదు. సాధారణంగా నేను బంతిని స్వింగ్ చేస్తా.. కానీ ఈ టోర్నీలో చివరి 4 మ్యాచ్‌ల్లో బంతి స్వింగ్ కాలేదు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా స్వింగ్ అయ్యింది. దీంతో ఈజీగా వికెట్లు పడగొట్టాను" అని మ్యాచ్ అనంతరం సిరాజ్ అన్నాడు.