గత ఏడు మ్యాచ్‌ల్లో ఓ ద్విశతకం, మూడు సెంచరీలు.. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక స్కోరు.. చిన్న వయసులోనే పొట్టి ఫార్మాట్లో శతకం చేసిన భారత క్రికెటర్.. అన్ని ఫార్మాట్లలోనూ మూడంకెల స్కోరు అందుకున్న అయిదో టీమ్‌ఇండియా ఆటగాడు.. ఇలా తక్కువ వయసులోనే ఎన్నో ఘనతలను ఖాతాలో వేసుకున్నాడు 23 ఏళ్ల పంజాబీ కుర్రాడు శుభ్‌మన్.
ఈ తరం కుర్రాళ్లలో చాలామంది ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు. టీ20ల్లో సత్తాచాటితే.. వన్డేలకు వచ్చే సరికి విఫలమవుతున్నారు. ఇక టెస్టుల గురించి ఆలోచించడమే లేదు. కానీ రోహిత్, కోహ్లి లాగా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టే ఆటగాడిగా శుభ్‌మన్ గుర్తింపు పొందుతున్నాడు. ఈ వయసులోనే పరిపూర్ణమైన ఆటగాడిగా.. టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా, ఫార్మాట్‌కు తగ్గ ఆటతీరుతో అలవోకగా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకూ 13 టెస్టుల్లో ఓ శతకం సహా 736 పరుగులు, 21 వన్డేల్లో 3 సెంచరీలు, ఓ ద్విశతకం కలిపి 1254 పరుగులు, 6 టీ20ల్లో ఓ సెంచరీతో సాయంతో 202 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని సగటు 73.76గా ఉండడం విశేషం.
పరుగుల దాహం..
ఇటీవల శ్రీలంకతో మూడో వన్డేలో శుభ్‌మన్ సెంచరీ (116) చేసినా అతని తండ్రి లఖ్‌విందర్ సింగ్‌కు ఆనందం లేదు. పైగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని గిల్ ఉపయోగించుకోలేదనేది అతని కోపానికి కారణం. కానీ కివీస్‌తో తొలి వన్డేలో ఆ ముచ్చట తీర్చేశాడు గిల్. అతనిలా పరుగుల వేటలో సాగడం వెనుక కుటుంబ ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెరీర్ ఆరంభం నుంచి అతణ్ని వెన్నుతట్టి నడిపిస్తోంది అదే.
2018 అండర్-19 ప్రపంచకప్‌లో అతని దూకుడు మాములుగా సాగలేదు. ఆ టోర్నీలో 124 సగటుతో 372 పరుగుల చేసి దేశానికి కప్పు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరుగుల మోత మోగించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గానూ నిలిచాడు. సీనియర్ జట్టు తరపున ఆరంభంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా.. తట్టుకుని నిలబడ్డాడు.
ఇప్పుడు అతను నిలబడితే చాలు పరుగుల వరదే. ఫార్మాట్‌కు తగ్గట్లుగా గేర్లు మారుస్తూ ఆడడం అతని ప్రత్యేకత. పరిస్థితులకు అనుకూలంగా ఆటతీరు మార్చుకోవడంలోనూ పట్టు సాధించాడు. టెస్టుల్లో గంటల పాటు క్రీజులో నిలబడడం, వన్డేల్లో సందర్భోచితంగా గేర్లు మార్చడం, టీ20ల్లో విధ్వంసానికి దిగడం అతనికి అలవాటుగా మారింది.
ఏ సవాలైనా..
2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్ ఆస్ట్రేలియా గడ్డపై ఆకట్టుకున్నాడు. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి పేసర్లను ఎదుర్కొని.. జట్టు చారిత్రక టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతని 91 పరుగుల ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కఠిన సవాలును దాటి.. చెమటోడ్చి జట్టు విజయానికి బాటలు వేశాడు. ప్రమాదకర ప్రత్యర్థి బౌలింగ్‌ను కాచుకుని క్రీజులో గడిపాడు. ఇది అతని టెస్టు బ్యాటింగ్ సామర్థ్యాలకు దర్పణం పట్టింది. వన్డేల్లో కివీస్‌తో మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ చేస్తాడని అనుకోలేదు. కానీ చివర్లో సిక్సర్లతో విరుచుకుపడి ఆ ఘనత అందుకున్నాడు.