Shubman Gill Health Condition : వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఊపుమీదున్న టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది. జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో గిల్ బాధపడుతున్నాడు. "ప్లేట్‌లెట్ కౌంట్ 70,000కు పడిపోవడం వల్ల ముందు జాగ్రత్తగా గిల్‌ను ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అవసరమైన టెస్టులు నిర్వహించారు. సోమవారం అతడిని డిశ్చార్జ్ చేశారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐమెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా గిల్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుధవారం జరగబోయే అఫ్గాన్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కూ డౌటే!
India Vs Pakistan World Cup 2023 : గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డెంగీ జ్వరంతో బాధపడుతున్న గిల్.. కోలుకోవడానికి కాస్త సమయం పట్టనుంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయమే ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో గిల్ ఆడటం దాదాపు సాధ్యం కాకపోవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి వచ్చేవరకు రోహిత్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు. అయితే శుభ్‌మన్ పూర్తిగా వరల్డ్‌కప్ స్క్వాడ్ నుంచి తొలగిస్తే.. సెలక్టర్లు రుతురాజ్ గైక్వాడ్ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మెగా టోర్నీకి ముందు ఆసీస్‌తో సిరీస్‌లో రుతురాజ్ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. గైక్వాడ్ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.