ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియాకు.. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు భారీ షాక్ తగిలింది. వెన్ను గాయం కారణంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తెలిపాడు. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు చెప్పాడు. అయితే అతడికి శస్త్రచికిత్స అవసరమా కాదా అనేది ధ్రువీకరించలేదు.
"గాయాలు ఆటలో ఒక భాగం. అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీతో కాంటాక్ట్‌లో ఉన్నాం. శ్రేయస్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు" అని భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ సమయంలో శ్రేయస్‌కు వెన్ను గాయం తీవ్రత ఎక్కువైంది. దీంతో అతడు బ్యాటింగ్ కూడా చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అయ్యర్‌ను ఆసుపత్రికి తరలించి పలు పరీక్షలు జరపించారు. గాయం నయమవడానికి 4-5 వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు శ్రేయం గాయం తీవ్రత పెరగడం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాకే. అతడు ఐపీఎల్ 2023 ఫస్టాఫ్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే కెప్టెన్ సేవలను కోల్పోవడం కేకేఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికిప్పుడు అయ్యర్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకు రావడం కష్టం కానీ.. జట్టులో ఉన్న ఓ ముగ్గురిని కెప్టెన్‌గా నియమించుకోవచ్చు. వరల్డ్ నెంబర్ వన్ ఆల్‌రౌండర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోనే బంగ్లాదేశ్ సొంతగడ్డపై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో అతడికే సారథ్య బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
షకీబ్ తర్వాత టిమ్ సౌథీ పేరు కూడా కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్ట్ టీమ్‌ను నడిపిస్తున్న సౌథీ.. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో సౌథీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వదేశీ ప్లేయర్‌నే కెప్టెన్‌గా నియమించుకోవాలనుకుంటే మాత్రం నితీశ్ రాణా.. కేకేఆర్ సారథ్య బాధ్యతలను అందుకోనున్నాడు.